ఎల్నినో ప్రభావం.. వరి సాగుకు దూరంగా ఉండండి
* కూరగాయలు, పశుగ్రాస పంటలకు ప్రాధాన్యమివ్వాలి
* కోదాడలో రైతులకు వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి సురేంద్ర మోహన్ సూచన
కోదాడ అక్టోబర్ 17 (విజయక్రాంతి) : ఎల్నినో పరిస్థితుల(El Nino conditions) నేపథ్యంలో రైతులు పంటల సాగులో తగిన జాగ్రత్తలు పాటించాలని వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి సురేంద్ర మోహన్(Surendra Mohan) సూచించారు. శనివారం సూర్యాపేట జిల్లా(Suryapet District) కోదాడ మండలం గుడిబండ గ్రామంలో పర్యటించిన ఆయన కాలీఫ్లవర్ సాగు(Cauliflower Cultivation) చేస్తున్న రైతుల పొలాలను(Farmers' fields) పరిశీలించి పలు సూచనలు చేశారు. భూగర్భ జలాలు అడుగంటిపోవడం, వర్షాభావ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉండటంతో నీటి లభ్యతను బట్టి పంటలను ఎంపిక చేసుకోవాలని తెలిపారు.
రానున్న రోజుల్లో కూరగాయల కొరత ఏర్పడే అవకాశం ఉన్నందున రైతులు కూరగాయలు, పశుగ్రాస పంటల సాగుకు మొదటి ప్రాధాన్యమివ్వాలని సూచించారు. ఒకటి, రెండు నీటి తడులు మాత్రమే అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో పెసర, కంది, మినుము, జొన్న వంటి ఆరుతడి పంటలను సాగు చేయాలని, నీటి వినియోగం అధికంగా ఉండే వరి పంటకు దూరంగా ఉండాలని స్పష్టం చేశారు.నీటిని పొదుపుగా వినియోగించేందుకు స్ప్రింక్లర్, డ్రిప్ విధానాలను అవలంబించాలని సూచించారు.
ఉద్యాన శాఖ ద్వారా రైతులకు డ్రిప్ పరికరాలు, సబ్సిడీ విత్తనాలు అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రైతులకు అవసరమైన వ్యవసాయ యంత్ర పరికరాలను త్వరలో సహకార సంఘాలు, ఎఫ్పీవోలు, మహిళా సంఘాల ద్వారా అందించనున్నట్లు తెలిపారు.రైతు వేదికల ద్వారా ఎప్పటికప్పుడు ఎల్నినో పరిస్థితులు, వాటి ప్రభావం, పంటల ఎంపికపై రైతులకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా రైతులు సబ్సిడీపై విత్తనాలు అందించాలని ముఖ్య కార్యదర్శిని కోరారు.
ఉన్నతాధికారి స్వయంగా పొలాలను సందర్శించి సాగు సూచనలు చేయడంపై రైతులు హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి పాలెం రజని, ఉద్యాన శాఖ అధికారి అనిత, వ్యవసాయ అధికారి రాజు, ఏఈవోలు మహేష్, నగేష్, పిచ్చయ్య, ఉద్యాన విస్తరణ అధికారి ఇస్మాయిల్, సొసైటీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, రైతులు ఖాజామియా, రఫీ, గౌసుద్దిన్ తదితరులు పాల్గొన్నారు.