ఎంవీస్సార్ ఇంజనీరింగ్ కళాశాలలో విషాదం

17-10-2026 | 11:26pm

*  బతుకమ్మ వేడుకల్లో కూలిన లైటింగ్ వ్యవస్థ

* ​ఘటనలో ఇద్దరు విద్యార్థులు మృతి.. 

* 20 మందికి పైగా తీవ్ర గాయాలు

* ​ఒకరి పరిస్థితి విషమం.. మరొకరు కోమాలోకి..

* గాయపడిన పలువురు విద్యార్థులను కామినేని ఆసుపత్రికి తరలింపు 

* స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి 

* బాధ్యుల పైన కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశం 

* ​దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

​హైదరాబాద్ సిటీబ్యూరో / ఆదిభట్ల అక్టోబర్ 17 (విజయక్రాంతి): మహేశ్వరం నియోజకవర్గంలోని(Maheshwaram Constituency) నాదర్‌గుల్‌లోని  ఎంవీస్సార్ ఇంజనీరింగ్ కళాశాలలో(MVSR Engineering College) బతుకమ్మ సంబరాల(Bathukamma celebrations) వేళ ఘోర విషాదం చోటుచేసుకుంది. ఎంతో ఉత్సాహంగా, కోలాహలంగా జరుపుకోవాల్సిన పండుగ వేడుకలు విద్యార్థులపాలిట శాపంగా మారాయి. వేడుకల కోసం కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన భారీ లైటింగ్(Massive lighting), సౌండ్ సిస్టమ్స్( and sound systems) ఒక్కసారిగా కుప్పకూలడంతో పెను ప్రమాదం సంభవించింది.

కళాశాలలో విద్యార్థులు(Students) ఎంతో ఆనందంగా బతుకమ్మ వేడుకలు జరుపుకుంటున్న సమయంలో.. అకస్మాత్తుగా వేదిక వద్ద ఏర్పాటు చేసిన భారీ లైటింగ్ స్ట్రక్చర్ మరియు సౌండ్ సిస్టమ్స్ ఒక్కసారిగా విద్యార్థులపై పడిపోయాయి. ఈ ఊహించని ప్రమాదంతో అక్కడున్న విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురై పరుగులు తీశారు.దీంతో అక్కడ ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కాలేదు.​ఈ దుర్ఘటనలో ఇద్దరు విద్యార్థులు ప్రాణాలు కోల్పోగా 

​సుమారు 20 మంది వరకు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. ​క్షతగాత్రుల్లో ఒకరి పరిస్థితి అత్యంత విషమంగా ఉండగా, మరో విద్యార్థి కోమాలోకి వెళ్ళినట్లు వైద్యవర్గాలు వెల్లడించినట్లు తెలుస్తోంది.​ గాయపడిన విద్యార్థులను కామినేని తో పాటు స్థానిక ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

* ​ఘటనా స్థలానికి పోలీసులు...

సమాచారం అందుకున్న వెంటనే ఆదిభట్ల పోలీసులు, కళాశాల యాజమాన్యం తక్షణమే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. విద్యార్థులను ఆసుపత్రికి తరలించారు.ప్రమాదానికి గల అసలు కారణాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

* బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి సీఎం ఆదేశం..... ఈ ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) తీవ్ర దిగ్భ్రాంతి మరియు విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదానికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

​​కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి

ఎంవీస్సార్ కళాశాలలో జరిగిన ఈ ప్రమాదంలో విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడం పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) తీవ్ర దిగ్భ్రాంతి, ఆవేదన వ్యక్తం చేశారు. మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ విషాదాన్ని భగవంతుడు ఆ కుటుంబాలకు తట్టుకునే మనోధైర్యం ప్రసాదించాలని ఆకాంక్షించారు. అలాగే, ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న గాయపడిన విద్యార్థులకు మెరుగైన వైద్యం అందేలా ప్రభుత్వం, యాజమాన్యం చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

* ​భద్రతా ప్రమాణాలపై విమర్శలు....

వేడుకల ఏర్పాట్లలో నిర్వాహకులు తగిన భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నాణ్యత లేని సామగ్రిని ఉపయోగించడం, సరైన మద్దతు లేని స్ట్రక్చర్లను ఏర్పాటు చేయడం వలనే ఈ ప్రాణనష్టం జరిగిందని విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు మండిపడుతున్నారు. విద్యార్థుల భద్రతకు అత్యంత ప్రాధాన్యమివ్వాల్సిన విద్యాసంస్థల్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

​గాయపడిన విద్యార్థుల పూర్తి ఆరోగ్య పరిస్థితిపై కళాశాల యాజమాన్యం మరియు ఆసుపత్రి వర్గాల నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

మరిన్ని వార్తలు