రైతులు సబ్సిడీ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి
మహమ్మదాబాద్ : రైతుల సంక్షేమం(Welfare of Farmers), వ్యవసాయ అభివృద్ధిని(Agricultural Development) దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం అమలు చేస్తున్న సబ్సిడీ పథకాలను రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని పరిగి ఎమ్మెల్యే, డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి(Parigi MLA, Dr. T. Rammohan Reddy) సూచించారు. మహమ్మదాబాద్ మండల పరిధిలోని ముకర్లాబాద్ గ్రామ రైతు వేదికలో ఉద్యానవన, పట్టు పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ సూక్ష్మ సేద్య పథకం(Telangana Micro-Irrigation Scheme) (TGMIP) కింద రైతులకు పోర్టబుల్ స్ప్రింక్లర్ యూనిట్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి రైతులకు స్ప్రింక్లర్ యూనిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతుల అభ్యున్నతి కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. ఆధునిక వ్యవసాయ పరికరాల వినియోగం, నూతన సాంకేతిక పరిజ్ఞానంపై(New technology) రైతులకు సంబంధిత శాఖల అధికారులు అవగాహన కల్పించాలని సూచించారు.
వ్యవసాయ రంగ అభివృద్ధికి ప్రభుత్వం అందిస్తున్న సహాయ సహకారాలను రైతులు వినియోగించుకోవాలని కోరారు. వాతావరణ మార్పుల వల్ల వ్యవసాయ రంగంపై ప్రభావం పడే అవకాశం ఉన్నందున రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వ్యవసాయ శాఖ అధికారులు అందించే సలహాలు, సూచనలు పాటిస్తూ నీటి వనరులను పొదుపుగా వినియోగించుకోవాలని తెలిపారు. వర్షాభావ పరిస్థితులు ఎదురైనప్పుడు వాటిని సమర్థవంతంగా అధిగమించేందుకు రైతులు ముందస్తు ప్రణాళికతో వ్యవహరించాలని పేర్కొన్నారు.
9 స్ప్రింక్లర్ యూనిట్ల పంపిణీ...
తెలంగాణ సూక్ష్మ సేద్య పథకం కింద మహమ్మదాబాద్ మండలంలో మొత్తం 9 పోర్టబుల్ స్ప్రింక్లర్ యూనిట్లను రైతులకు పంపిణీ చేశారు. సిగ్నెట్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ సరఫరా చేసిన ఒక్కో యూనిట్ ధర రూ.24,555 కాగా, 9 యూనిట్ల మొత్తం వ్యయం రూ.2,20,995. ఈ పథకం కింద ప్రభుత్వం 65 శాతం సబ్సిడీ అందిస్తోంది. ఒక్కో యూనిట్‌కు సబ్సిడీ మినహాయించి రైతు చెల్లించాల్సిన వాటా రూ.8,770గా ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ కమతం శ్రీనివాసరెడ్డి, మహమ్మదాబాద్ సర్పంచుల సంఘం అధ్యక్షుడు జె. రాంలాల్, స్థానిక సర్పంచి లక్ష్మీమైబు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కేఎం నారాయణ, ఉద్యానవన శాఖ అధికారి స్వప్న,శాంతిరంగ్యా, గిరిధర్ రెడ్డి, హెచ్. ముకుందం, సతీష్ రెడ్డి తదితర కాంగ్రెస్ నాయకులు, ఉద్యానవన శాఖ, వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు పాల్గొన్నారు.