రైతన్నను ముంచిన "మురసు" తుపాన్
- రైతన్నకు కన్నీటి కష్టం.. నీటి పాలైన పంట
- అన్నదాత ఆశలపై వరుణుడి దెబ్బ..
- ఆగని వర్షం.. ఆగని రైతు కన్నీరు!
- కోతకు వచ్చిన వరి నీటిపాలు..
- నల్లబారుతున్న పత్తి.. మొలకెత్తుతున్న పెసర పంట..
- ప్రభుత్వం ఆదుకోవాలని కొరుతున్న రైతులు
ఖమ్మం, నవంబర్ 3 (విజయ క్రాంతి): ముసరు తుపాన్(Murusu Cyclone) రైతన్నలను నట్టెట ముంచింది.. చేతికందే దశలో పంటలు నీటి పాలైయ్యి ఆరుగాలం కష్టపడి పంటలు పండించి చేతికందే సమయంలో ఆదాయం వస్తుందని ఆశించిన రైతన్నకు ప్రకృతి మరోసారి తీవ్రనష్టాన్ని మిగిల్చింది. రైతుల కష్టం కన్నీటి పాలైంది.. ఇప్పటికే అర్నబ్ తుపాన్ తో(Cyclone Arnab) కొంతమేరకు నష్టపోయిన రైతులకు పుండు మీద కారం పడినట్లు మురసు తుపాన్(Murusu Cyclone) రైతులను నట్టేట ముంచేసింది.
సోమవారం రాత్రి నుంచి జిల్లావ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు అన్నదాతలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. మురసు తుపాను ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు పంట పొలాలు నీటితో నిండిపోతుండగా, కోతకు సిద్ధంగా ఉన్న వరి పంట నీటిపాలవుతోంది. తెల్ల బంగారంగా పేరొందిన పత్తి పంట వర్షపు నీటికి తడిసి నల్లబారుతుండటంతో రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి నెలకొంది.
పత్తి పంటకు వర్షాలు తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి. పత్తి కాయలు తడిసిపోవడంతో నల్లబారి నాణ్యత కోల్పోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే పత్తి సాగు కోసం పెట్టుబడులు పెట్టిన రైతులు దిగుబడి, గిట్టుబాటు ధరపై ఆందోళన చెందుతున్నారు. పెట్టుబడుల కోసం అప్పులు చేసి, ఎరువులు, విత్తనాలు, కూలీల ఖర్చులు భరించి పంటను కాపాడుకుంటూ వచ్చిన రైతులకు ప్రస్తుత వర్షాలు తీరని ఆవేదన మిగులుస్తున్నాయి.
చేతికందే దశలో నీటి పాలైన వారి పంట..
కోత కోసి ఆరబెట్టిన పంటలు తడవడం, పొలాల్లో నీరు నిలవడం వంటి సమస్యలు రైతులను కలవరపెడుతున్నాయి. కోతకు వచ్చిన వరి పంట పొలాల్లో వర్షపు నీరు నిలిచిపోవడంతో ధాన్యం నాణ్యత దెబ్బతినే ప్రమాదం ఏర్పడింది. వర్షాలు ఇలాగే కొనసాగితే పంట దిగుబడిపై తీవ్ర ప్రభావం పడటమే కాకుండా, చేతికొచ్చే ఆదాయం కూడా తగ్గిపోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
పంట చేతికొస్తే అప్పులు తీర్చుకోవచ్చని ఆశపడిన రైతుకు.. ఇప్పుడు పొలంలో నిలిచిన నీరే కనిపిస్తోంది. వర్షం ఎప్పుడు తగ్గుతుందో తెలియని పరిస్థితుల్లో, తమ కష్టం మిగులుతుందో లేదోనని అన్నదాతలు ఆందోళనతో ఆకాశం వైపు చూస్తున్నారు.
పెసర పంటకు కూడా వర్షాలు ప్రతికూలంగా మారుతున్నాయి. పొలాల్లో తేమ అధికమవడంతో పెసర గింజలు మొలకెత్తే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దీంతో పంట నాణ్యత దెబ్బతిని రైతులకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది.
వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులను వ్యవసాయ, రెవెన్యూ శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి పంట నష్టాన్ని అంచనా వేయాలని రైతులు కోరుతున్నారు. నష్టాల వివరాలను నమోదు చేసి, అర్హులైన రైతులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రకృతి వైపరీత్యాల నుంచి రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని అన్నదాతలు కోరుతున్నారు.