శాతవాహనలో ఆదాయపు పన్ను రిటర్న్స్, జీఎస్టీ ఫైలింగ్‌పై కార్యశాల
ముకరంపుర (విజయక్రాంతి): శాతవాహన విశ్వవిద్యాలయ(Satavahana University) వాణిజ్య శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో, ప్రభుత్వ డిగ్రీ కళాశాలల అకడమిక్ ఎంపవర్‌మెంట్ ప్రోగ్రామ్ – 100 రోజుల ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా ఆదాయపు పన్ను రిటర్న్స్ జీఎస్టీ ఫైలింగ్ పై రెండు రోజుల ప్రాక్టికల్ స్కిల్ డెవలప్‌మెంట్ వర్క్‌షాప్ మంగళవారం జరిగింది.
ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కామర్స్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్.వి. శ్రీరంగ ప్రసాద్ మాట్లాడుతూ, తరగతి గదిలో నేర్చుకున్న అంశాలను వాస్తవ జీవితంలోకి మార్చుకునే సామర్థ్యాన్ని పెంపొందించేందుకు ఈ ప్రాక్టికల్ వర్క్ షాప్‌లు ఉపయోగపడతాయని తెలిపారు. ముఖ్య అతిథి ఉపకులపతి ఆచార్య యు. ఉమేష్ కుమార్ మాట్లాడుతూ, దేశ నిర్మాణంలో ప్రతి పౌరుడు వివిధ పన్నుల ద్వారా భాగస్వామి అవుతున్నారని తెలిపారు. విశిష్ట అతిథి విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ఆచార్య పి. సతీష్ కుమార్ మాట్లాడుతూ, వస్తు సేవల పన్ను నిత్యజీవితంలో అంతర్భాగమైందని వివరించారు.
కీలకోపన్యాసకులుగా పాల్గొన్న ఉస్మానియా వాణిజ్య శాస్త్ర విభాగాధిపతి ఆచార్య కె. కృష్ణ చైతన్య మాట్లాడుతూ, ప్రతి రోజూ అనేక కార్యకలాపాలు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా వాణిజ్యం తో ముడిపడి ఉంటాయని వివరించారు. వస్తువుల కొనుగోలు, విక్రయాలు, బ్యాంకింగ్, డిజిటల్ చెల్లింపులు, పెట్టుబడులు, వ్యాపార లావాదేవీలు వంటి అంశాలు వాణిజ్య శాస్త్ర ప్రాధాన్యాన్ని తెలియజేస్తాయన్నారు. ముఖ్యంగా ఆదాయపు పన్ను, జీఎస్టీ, అకౌంటింగ్, ఆడిటింగ్, టాక్స్
కన్సల్టెన్సీ, ఫైనాన్షియల్ సర్వీసెస్ వంటి రంగాల్లో విద్యార్థులకు అనేక ఉపాధి అవకాశాలు ఉన్నాయని తెలిపారు. గౌరవ అతిథి చార్టర్డ్ అకౌంటెంట్ సీఏ డి. నిరంజన చారి మాట్లాడుతూ, వ్యక్తులు, వ్యాపార సంస్థలు ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయడంలో, జీఎస్టీ నమోదు, రిటర్నుల సమర్పణ, పన్నుల గణన, చట్టపరమైన నిబంధనల అమలులో చార్టర్డ్ అకౌంటెంట్లు కీలక పాత్ర పోషిస్తారని వివరించారు.
వర్క్ షాప్ కన్వీనర్, వాణిజ్య శాస్త్ర విభాగాధిపతి ఓఎస్డీ డాక్టర్ డి. హరికాంత్ మాట్లాడుతూ, విద్యార్థులకు ఆదాయపు పన్ను, జీఎస్టీ కి సంబంధించిన ప్రాథమిక అంశాలతో పాటు రిటర్ను లను స్వయంగా దాఖలు చేసే విధానంపై ఆచరణాత్మక శిక్షణ అందించడమే ఈ రెండు రోజుల వర్క్ షాప్ ప్రధాన లక్ష్యమని వివరించారు. ఈ కార్యక్రమంలో వర్క్ షాప్ కో-కన్వీనర్లు, వాణిజ్య శాస్త్ర విభాగ అధ్యాపకులు, పరిశోధక విద్యార్థులు, వివిధ కళాశాలల విద్యార్థులు, విశ్వవిద్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.