పోక్సో చట్టంపై విద్యార్థులకు అవగాహన సదస్సు
ముకరంపుర,(విజయక్రాంతి): బాలలపై లైంగిక నేరాల(Sexual crimes)ను అరికట్టి, వారి హక్కులను పరిరక్షించడంతో పాటు ప్రతి చిన్నారికి సురక్షితమైన బాల్యాన్ని అందించడమే లక్ష్యంగా చేపట్టిన ‘సురక్షిత్ బచ్పన్ అభియాన్’(Surakshit Bachpan Abhiyan)లో భాగంగా కరీంనగర్ జిల్లాలోని పాఠశాలల్లో న్యాయ అవగాహన కార్యక్రమాలు(Legal Awareness Programs) ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా సోమవారం తీగలగుట్టపల్లి లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు.
జాతీయ న్యాయ సేవాధికార సంస్థ మార్గదర్శకాలు, తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్. శివ కుమార్ అనుమతితో అక్టోబర్ 26 నుంచి 31వ తేదీ వరకు జిల్లావ్యాప్తంగా ఈ ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ న్యాయమూర్తి యశ్వంత్ సింగ్ తెలిపారు.
తీగలగుట్టపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన సదస్సులో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సభ్యులు, న్యాయవాదులు ఏ. కిరణ్ కుమార్, సీహెచ్. చంద్ర ప్రకాష్ రెడ్డి, పి. రంగయ్య లు విద్యార్థులకు బాలల పై లైంగిక నేరాల నుంచి రక్షణ చట్టం–2012 పై అవగాహన కల్పించారు. బాలల పై లైంగిక వేధింపులను గుర్తించడం, అనుచిత ప్రవర్తన ఎదురైనప్పుడు ఎలా స్పందించాలి, అలాంటి ఘటనలను తల్లిదండ్రులు లేదా విశ్వసనీయ పెద్దల దృష్టికి ఎలా తీసుకెళ్లాలి అనే అంశాలను వివరించారు.
బాధిత బాలలకు చట్టం కల్పిస్తున్న రక్షణ, అందుబాటులో ఉన్న ఉచిత న్యాయ సహాయ సేవల గురించి తెలియజేశారు. ఎలాంటి వేధింపులు ఎదురైనా భయపడకుండా, మౌనంగా ఉండకుండా విశ్వసనీయ పెద్దలకు తెలియజేసి సహాయం పొందాలని న్యాయవాదులు విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కరుణశ్రీ, చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ దూస మమత, విద్యార్థులు పాల్గొన్నారు.