కార్పొరేషన్ పరిస్థితి పెనం మీదినుండి పొయ్యిలోకి
సుడా మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి
ముకరంపుర, నవంబర్ 4 (విజయక్రాంతి): మున్సిపల్ కార్పొరేషన్ పరిస్థితి పెనం మీది నుండి పొయ్యిలో పడ్డట్టయిందని సుడా మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి(Komati Reddy Narender Reddy) ఎద్దేవా చేశారు. తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గత బిఆర్ఎస్ పాలకవర్గంలో కీలకంగా వ్యవహరించిన వారే ఈరోజు బిజెపి పాలకవర్గంలో ఉన్నారని, నరమాంసానికి అలవాటు
పడ్డ వారిని సాధువులుగా మారమంటే ఎలా సాధ్యమని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ కుమార్ ను ప్రశ్నించారు. ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని, ముఖ్యంగా ఒకవైపు డంపు యార్డు సమస్య, మరొక వైపు విలీన గ్రామాల డివిజన్లలో అనేక సమస్యలు ఉన్నాయని, పౌర సేవలు సరిగా అందక ప్రజలు ఇబ్బందులు పడుతు ఉన్నారని అన్నారు.
యుఐడిఎఫ్ కు పూర్తి నిధులు రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని, యూసిఎఫ్ లో కూడా 75 శాతం నిధులు రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని ఇవే కాకుండా కరీంనగర్ అభివృద్ధికి మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, లక్ష్మణ్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వం తరపున రావాల్సిన నిధులు మంజూరు చేయించడానికి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. అలాగే బిఆర్ఎస్ నాయకుడి వద్ద నిజంగానే ఆడియో రికార్డులు ఉంటే వెంటనే ప్రజల ముందు పెట్టాలని అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో కార్పొరేటర్ గంట శ్రీనివాస్ నాయకులు గుండాటి శ్రీనివాస్ రెడ్డి, జీడి రమేష్, దన్న సింగ్, షబానా మహమ్మద్, దండి రవీందర్, మామిడి సత్యనారాయణ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.