దుబాయ్‌లో ఫిట్‌నెస్ సంబరం..

04-11-2026 | 08:52pm

దుబాయ్: దుబాయ్ క్రౌన్ ప్రిన్స్, యూఏఈ ఉప ప్రధానమంత్రి, రక్షణ శాఖ మంత్రి, దుబాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఛైర్మన్ అయిన హిజ్ హైనెస్ షేక్ హమ్దాన్ బిన్ మహమ్మద్ బిన్ రాషిద్ అల్ మక్తూమ్ చొరవతో ప్రారంభమైన దుబాయ్ ఫిట్‌నెస్ ఛాలెంజ్(Dubai Fitness Challenge) 10వ ఎడిషన్, 31 అక్టోబర్ 2026న తిరిగి ప్రారంభమవుతూ 30x30 దశాబ్ది వేడుకకు సిద్ధమైంది. ప్రపంచంలోని అత్యంత చురుకైన నగరాల్లో ఒకటిగా ఎదగాలన్న దుబాయ్ ప్రయాణాన్ని ఇది కొనసాగిస్తుంది. ‘What’s Your 30x30?’ థీమ్‌తో, డీఎఫ్‌సీ 2026 నివాసితులను, సందర్శకులను చురుకుగా ఉండేందుకు తమదైన మార్గాన్ని కనుగొనాలని, 30 రోజుల పాటు ప్రతిరోజూ 30 నిమిషాలు శారీరక శ్రమకు కేటాయిస్తామని సంకల్పం తీసుకోవాలని ఆహ్వానిస్తోంది. తద్వారా దుబాయ్ ఫిట్‌నెస్, శ్రేయస్సు, సామాజిక ఐక్యతల ఉత్సాహభరిత నగరవ్యాప్త వేడుకగా మారుతోంది.

దుబాయ్ స్పోర్ట్స్ కౌన్సిల్ సెక్రటరీ జనరల్ హిజ్ ఎక్సలెన్సీ సయీద్ హారెబ్ మాట్లాడుతూ: “దుబాయ్ ఫిట్‌నెస్ ఛాలెంజ్ తన చారిత్రక 10వ ఎడిషన్‌ను జరుపుకుంటున్న వేళ, హిజ్ హైనెస్ షేక్ హమ్దాన్ బిన్ మహమ్మద్ బిన్ రాషిద్ అల్ మక్తూమ్ దార్శనికత మాకు గుర్తుకొస్తోంది. ప్రతి ఒక్కరూ 30 రోజుల పాటు రోజుకు 30 నిమిషాలు శారీరక శ్రమకు కేటాయించేలా ప్రోత్సహించేందుకు ఆయన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దశాబ్ద కాలం తర్వాత, ఈ ఛాలెంజ్ కేవలం వార్షిక ఫిట్‌నెస్ కార్యక్రమంగా కాకుండా అంతకు మించిన స్థాయికి ఎదిగింది. ఇది చురుకైన జీవనశైలి సంస్కృతిని నెలకొల్పడంలో దోహదపడింది, సమాజాలను ఏకం చేసింది, క్రీడలు, శారీరక శ్రమను దుబాయ్ జీవితంలో అంతర్భాగంగా మార్చిందన్నారు.

దుబాయ్ ఫెస్టివల్స్ అండ్ రిటైల్ ఎస్టాబ్లిష్‌మెంట్ (డీఎఫ్‌ఆర్‌ఈ) సీఈఓ అహ్మద్ అల్ ఖాజా మాట్లాడుతూ: “దుబాయ్ ఫిట్‌నెస్ ఛాలెంజ్ 10వ ఎడిషన్ అనే మైలురాయిని మనం జరుపుకుంటున్న వేళ, ఫిట్‌నెస్ ద్వారా మన నగరాన్ని ఏకం చేయడంలో ఈ కార్యక్రమం ఎంత దూరం ప్రయాణించిందో ఈ ఏడాది ఈవెంట్ల క్యాలెండర్ ప్రతిబింబిస్తోంది. డీఎఫ్‌సీని ప్రత్యేకంగా నిలిపేది దీని వెనుక ఉన్న సమష్టి కృషే. నగరమంతటా ఫిట్‌నెస్‌ను అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వ సంస్థలు, ప్రైవేట్ రంగ భాగస్వాములు, సమాజాలు కలిసికట్టుగా పనిచేస్తున్నాయి.

మా భాగస్వాముల నిరంతర మద్దతు, మా కమ్యూనిటీ ఉత్సాహంతో, 30 రోజుల తర్వాత కూడా ఆరోగ్యకరమైన అలవాట్లకు స్ఫూర్తినిచ్చే ఉమ్మడి అనుభవాలను సృష్టిస్తున్నామన్నారు. నాలుగు ప్రధాన ఈవెంట్లను చూస్తే డీపీ వరల్డ్ సమర్పణలో దుబాయ్ రైడ్ జరగనుంది.2025లో రికార్డు స్థాయిలో 40,000 మందికి పైగా సైక్లిస్టులకు ఆతిథ్యమిచ్చిన తర్వాత, డీపీ వరల్డ్ సమర్పణలోని దుబాయ్ రైడ్, డీఎఫ్‌సీ 10వ ఎడిషన్ ప్రారంభ వారాంతాన్ని పురస్కరించుకుని వేలాది మంది సైక్లిస్టులను దుబాయ్ వీధుల్లోకి తీసుకురానుంది. అలాగే నవంబర్ 7,8 తేదీల్లో ఆర్టీఏ సమర్పణలో దుబాయ్ స్టాండ్ అప్ ప్యాడిల్, నవంబర్ 22న దుబాయ్ రన్, నవంబర్ 29న దుబాయ్ యోగా జరగనున్నాయి.

మరిన్ని వార్తలు