మురుగు కాలువలో పడి మహిళ మృతి

04-11-2026 | 08:39pm

మల్లాపూర్, నవంబర్ 04 (విజయక్రాంతి): మల్లాపూర్ గ్రామంలో ప్రమాదవశాత్తు మురుగు కాలువలో(sewage drains) పడి ఓ మహిళ మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం. గ్రామానికి చెందిన చిప్ప నడిపి లక్ష్మి (58), తన భర్త లక్ష్మణ్‌తో కలిసి నివసిస్తూ బీడీలు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఈ నెల 3వ తేదీ సాయంత్రం బట్టలు కొనుగోలు చేసేందుకు గ్రామంలోని స్వప్న సెలక్షన్స్‌కు వెళ్తున్నానని భర్తకు చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లింది.

రాత్రి అయినప్పటికీ ఆమె ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆచూకీ కోసం వెతికారు. ఈ క్రమంలో రాత్రి సుమారు 9.30 గంటల సమయంలో గ్రామానికి చెందిన గొట్టి పడతల స్వామి తన ఇంటి ముందు ఉన్న మురుగు కాలువలో లక్ష్మి పడి ఉన్నట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు.

వెంటనే అక్కడికి చేరుకున్న కుటుంబ సభ్యులు ఆమెను బయటకు తీసి చూడగా తల వెనుక భాగంలో తీవ్ర రక్త గాయంతో పాటు శరీరంలోని ఇతర భాగాల్లో గాయాలు కనిపించాయి. దీంతో వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం మెట్‌పల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై మల్లాపూర్ పోలీసులు కేస్ నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.

మరిన్ని వార్తలు