వివాదంలో దేమికలాన్ సింగిల్ విండో...
- నామినేటెడ్ పదవుల ఎంపికలో గందరగోళం...
- ఇష్టారాజ్యంగా పదవులు ఇచ్చారని ఆందోళన...
తాడ్వాయి, అక్టోబర్ 19 (విజయక్రాంతి): రైతులకు ప్రయోజనాలు సమకూర్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రత్యేకంగా గ్రామాలలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘా(Primary Agricultural Cooperative Society)లను ఏర్పాటు చేసింది. ఈ సంఘాలతో రైతులకు ప్రత్యేక సేవలు అందించాలని ప్రభుత్వం సంకల్పించింది. రైతుల వద్దకే ఎరువులు,విత్తనాలు తీసుకురావాలనే లక్ష్యంతో ఈ సంఘాలను ఏర్పాటు చేసింది.
ఈ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో రైతులే నాయకులుగా ఉండి పరిపాలన కొనసాగించుకోవాలని ప్రభుత్వం నిర్దేశించింది. అందుకోసం ప్రత్యేకంగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించి చైర్మన్, వైస్ చైర్మన్,డైరెక్టర్లను నియమిస్తారు.కానీ ప్రస్తుతం ప్రభుత్వం అందుకు భిన్నంగా ఎలాంటి ఎన్నికలు నిర్వహించకుండానే నామినేటెడ్ పోస్టులతో పదవులను ఎంపిక చేయడంతో గందరగోళం ఏర్పడింది.
కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం దేమి కలాన్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి నామినేటెడ్ పోస్టులను ఎంపిక చేశారు.సింగిల్ విండో చైర్మన్ గా కన్కల్ గ్రామానికి చెందిన ఏనుగు వెంకట్ రెడ్డిని నియమించారు. కన్కల్ గ్రామం నుంచి ఐదుగురు డైరెక్టర్లను, కరడుపల్లి గ్రామం నుంచి ఐదుగురు డైరెక్టర్లను ఎంపిక చేసి నియమించారు. దేమికలాన్ గ్రామానికి ఆరుగురు డైరెక్టర్ పోస్టులను ఇవ్వాల్సి ఉండగా 6 ఇవ్వకుండా కేవలం ఇద్దరు డైరెక్టర్లను మాత్రమే నియమించారు. దీంతో గ్రామంలో వివాదం మొదలైంది.
రాజుకుంటున్న వివాదం..
దేమికలాన్ గ్రామానికి సింగిల్ విండోలో ఆరు డైరెక్టర్ పదవులు ఉంటాయి. కానీ అందుకు విరుద్ధంగా ఇద్దరు డైరెక్టర్లను మాత్రమే ఎంపిక చేసి నియమించారు. గ్రామంలో మరో నలుగురికి డైరెక్టర్ పదవులు ఇవ్వలేదు. దీంతో గ్రామస్తులు,రైతులు బగ్గుమంటున్నారు.తమ గ్రామానికి ఎప్పుడు ఎన్నికలు నిర్వహించిన ఆరు డైరెక్టర్ పోస్టులు ఉంటాయని అందుకు విరుద్ధంగా రెండు డైరెక్టర్ పోస్టులే ఇవ్వడం ఏమిటని వారు ఎమ్మెల్యేను ప్రశ్నిస్తున్నారు.ఇప్పటికైనా అధికారులు స్పందించి ఖచ్చితంగా తమ గ్రామానికి ఆరు డైరెక్టర్ పోస్టులు ఇవ్వాలని పట్టుబడుతున్నారు.
- పాలన సాగనివ్వం...
మా దేమికలాన్ గ్రామానికి ఆరు డైరెక్టర్ పోస్టులు ఇచ్చేవరకు సింగిల్ విండోలో పాలనను సాగనివ్వమని గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు. మా గ్రామానికి కేవలం రెండు డైరెక్టర్ పోస్టులు మాత్రమే ఇచ్చారు.మిగతా నాలుగు ఎందుకు ఇవ్వలేదు అని ప్రశ్నిస్తున్నారు. ఖచ్చితంగా మిగతా డైరెక్టర్ పోస్టులు గ్రామానికి కేటాయించాలని కోరుతున్నారు. నాలుగు పోస్టులు మా గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన అభ్యంతరం లేదని తెలుపుతున్నారు. లేనియెడల పాలనను అడ్డుకుంటామని వాపోతున్నారు.