పది రోజుల.. పూల పండుగ
-శనిగరంలో బతుకమ్మ సందడి
కోహెడ, అక్టోబర్ 19, (విజయక్రాంతి): తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ(Bathukamma Festival) కోహెడ మండలం శనిగరం గ్రామంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. గ్రామంలో పది రోజుల పాటు బతుకమ్మ పండుగను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సంప్రదాయంలో భాగంగా ఆడపడుచులు తీరొక్క పూలతో అందంగా బతుకమ్మలను పేర్చి, సంప్రదాయ దుస్తుల్లో ముస్తాబై వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. బతుకమ్మ పాటలు, మహిళల కోలాటాలు, ఆటపాటలతో గ్రామంలో పండుగ సందడి నెలకొంది. రంగురంగుల పూలతో అలంకరించిన బతుకమ్మలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మహిళలంతా ఒక్కచోట చేరి బతుకమ్మల చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ ఆనందోత్సాహాల మధ్య సంబరాలు జరుపుకున్నారు.