సొసైటీ పదవులు నామినేటెడ్ విధానంలో కాకుండా ఎన్నికల ద్వారా తీర్మానించాలి

29-09-2026 | 05:34pm

నాగిరెడ్డిపేట్, సెప్టెంబర్ 29 (విజయక్రాంతి): మండలంలోని తాండూరు గ్రామం(Tandur Village)లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం తాండూర్ కిచ్చన్నపేట ఆధ్వర్యంలో సంఘ అధ్యక్షులు ఆకిడి గంగారెడ్డి అధ్యక్షతన మహాజన సభ మంగళవారం విజయవంతంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా 2026 ఏప్రిల్ ఒకటవ తేదీ నుండి సెప్టెంబర్ 20వ తేదీ వరకు సంఘంలో జరిగిన జామ, ఖర్చుల వివరాలు సంఘ సెక్రటరీ చంద్రమురళి సభలో చదివి సభ్యులకు వినిపించారు. అనంతరం సంఘ సభ్యులు, రైతుల అభ్యర్థులపై విస్తృతంగా చర్చించి పలు తీర్మానాలు ఏకగ్రీవంగా ఆమోదించారు.

యూరియా విక్రయాలను యాప్ పద్ధతి ద్వారా కాకుండా గతంలో కొనసాగిన విధంలోనే నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానించారు. యూరియా రవాణా ఖర్చులను ప్రభుత్వమే భరించాలని తీర్మానించారు. సొసైటీ పాలకవర్గాన్ని నామినేటెడ్ విధానంలో కాకుండా ఎన్నికల ద్వారా ఏర్పాటు చేయాలని తీర్మానించారు. రుణమాఫీ పొందని రైతులకు వెంటనే రెండు లక్షల వరకు రుణమాఫీ చేయాలని ప్రభుత్వానికి కోరుతూ తీర్మానించారు.

ఈ సందర్భంగా సంఘ అధ్యక్షులు ఆకిడి గంగారెడ్డి మాట్లాడుతూ... సంఘ సభ్యుల,రైతుల సమస్యలను మహాజన సభ దృష్టికి తీసుకురావడం వాటిపై చర్చించి తీర్మానాలు చేయడం జరిగిందన్నారు. రైతు ప్రయోజనాలకు సంబంధించి అన్ని అంశాలను సంబంధించిన అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు ఆకిడి గంగారెడ్డి, ఉపాధ్యక్షులు మిద్దే బాబురావు, సీఈవో చంద్ర మురళి, డైరెక్టర్లు వేముల సంగయ్య, విజయ్ కుమార్, సిద్ధిరాం రెడ్డి, హనుమాన్ నాయక్, బన్సీ నాయక్, కిషన్ నాయక్ రైతులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు