ఖర్గే అంశంపై చర్చ

29-09-2026 | 06:34pm

న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఢిల్లీలో దళిత, ఆదివాసీ ఆత్మగౌరవ సమావేశం నిర్వహించారు. కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో కాంగ్రెస్ ఎస్సీ, ఎస్టీ ఎంపీల ఫోరం ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సులో దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన నేతలు పాల్గొన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు సంబంధించిన హల్ద్వానీ ఘటన ప్రధానంగా సమావేశంలో చర్చకు వచ్చింది. ఖర్గే పాల్గొన్న కార్యక్రమం అనంతరం వేదికను శుద్ధి చేశారనే వివాదంపై కాంగ్రెస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనను దళితుల ఆత్మగౌరవానికి సంబంధించిన అంశంగా కాంగ్రెస్ ప్రస్తావిస్తోంది.

తెలంగాణ నుంచి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి సీతక్క సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఖర్గేను అవమానించేలా ఘటన జరిగిందని ఆరోపించారు. దేశంలో దళితులు, ఆదివాసీల గౌరవం, సమానత్వం, హక్కుల పరిరక్షణపై చర్చించాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై కూడా సమావేశంలో చర్చించినట్లు కాంగ్రెస్ తెలిపింది. ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన పలు అంశాలు, పౌర హక్కుల పరిరక్షణ చట్టం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ నిరోధక చట్టం అమలుపైనా చర్చ జరిగింది.

మరిన్ని వార్తలు