6 September, 2026 | 8:23 PM

రైతులకు రుణమాఫీలో రేవంత్ విఫలం

06-09-2026 | 06:30pm

మోసపూరిత మాటలతో దగా చేస్తున్నారు

తాడ్వాయి, సెప్టెంబర్ 06 (విజయ క్రాంతి): రైతులకు రుణాలు రూ.2 లక్షలు మాఫీ చేస్తానని గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి రైతుల రుణాలు మాఫీ చేయడంలో పూర్తిగా విఫలమయ్యాడని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ తీవ్రంగా విమర్శించారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలో ఆదివారం ఎల్లారెడ్డి నియోజకవర్గ స్థాయి రైతు మహాధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన విచ్చేసి మాట్లాడారు. 420 హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి రైతుకు రుణమాఫీ చేసి రైతులను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పి కొందరు రైతుల రుణాలు మాఫీ చేసి డంబాచారాలు కొట్టుకుంటున్నారని తెలిపారు. కొందరి రైతుల రుణాలు మాఫీ చేసి మేము రుణమాఫీ చేశామని ప్రగల్భాలు పలుకుతున్నారని ఎద్దేవా చేశారు. వెయ్యి రోజుల పాలనలో రేవంత్ సర్కార్ చేసింది ఏమీ లేదని తెలిపారు.

కౌలు రైతులకు రూ.15 వేలు ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కౌలు రైతులను మరిచిపోయిందన్నారు. రైతు కూలీలకు ఏడాదికి రూ.12 వేలు ఇస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఆ హామీని తుంగలో తొక్కిందన్నారు. కాంగ్రెస్ పాలనలో 6 గ్యారంటీలు అమలు చేసి అందరినీ ఆదుకుంటామని నమ్మబలికారని, ప్రస్తుతం ఆ హామీలను పూర్తిగా మర్చిపోయారన్నారు. వృద్ధులకు రూ.2 వేలు ఉన్న పింఛన్‌ను రూ.4 వేలకు పెంచుతామని హామీ ఇచ్చి ఆ హామీని మర్చిపోయారన్నారు.

నిరుపేద రైతులకు యూరియా కావాలంటే నానా తంటాలు పడుతున్నారన్నారు. రైతులు యాప్‌లో ఎలా బుక్ చేసుకుంటారని ప్రశ్నించారు. తాడ్వాయిలో యూరియా కొరత తీవ్రంగా ఉందని, యూరియా కొరతపై బీఆర్‌ఎస్ పార్టీ ఆందోళన చేస్తామంటే పోలీసులను పెట్టి ఆందోళన జరగకుండా నివారించారని తెలిపారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఇచ్చిన హామీలను తుంగలో తొక్కుతూ నావు మాత్రం పనులు చేసుకుంటూ వెళుతున్నారని తెలిపారు.

బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ముజీబోద్దిన్ మాట్లాడుతూ... ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఎక్కడ వెళ్లినా రూ.100 కోట్లు కావాలని అడుగుతున్నారని విమర్శించారు. 100 కోట్లు ప్రభుత్వం ఇవ్వాలి కానీ వరల్డ్ బ్యాంక్ ఎలా ఇస్తుందని ప్రశ్నించారు.

అంతకుముందు నాయకులు ఎడ్లబండ్లపై శ్రీ శబరిమాత ఆశ్రమం నుంచి పాత బస్టాండ్ వరకు ర్యాలీగా వచ్చారు. ఈ కార్యక్రమంలో తాడ్వాయి మండల శాఖ అధ్యక్షులు ముదాం నర్సింలు, సింగిల్ విండో చైర్మన్ నల్లవెల్లి కపిల్ రెడ్డి, నాయకులు పులగం సాయి రెడ్డి, రాజు గౌడ్, మంగారెడ్డి, ప్రభాకర్ రెడ్డి, ముదాం సాయిలు, శివాజీ, తానాజీ రావు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు