సీఎం ఇంటి ముట్టడి పిలుపుతో మా సంఘానికి సంబంధం లేదు
నాయకుల ముందస్తు అరెస్టులను ఖండిస్తున్నాం
కూనూరు సంజయ్ దాస్ గౌడ్
చిట్యాల,(విజయక్రాంతి): తెలంగాణ ముఖ్యమంత్రి నివాసం ముట్టడికి ఇచ్చిన పిలుపుతో తెలంగాణ మలిదశ ఉద్యమకారుల సంక్షేమ సంఘానికి ఎలాంటి సంబంధం లేదని ఆ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు కూనూరు సంజయ్ దాస్ గౌడ్ సోమవారం స్పష్టం చేశారు. సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మంద వేణుగోపాల్ రెడ్డి, నల్లగొండ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ జోగు లింగస్వామిలను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.
ఉద్యమకారుల సంక్షేమం కోసం శాంతియుతంగా కృషి చేస్తున్న నాయకులను ముందస్తుగా అరెస్టు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని పేర్కొన్నారు. తెలంగాణ మలిదశ ఉద్యమకారుల సంక్షేమానికి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, ప్రభుత్వ విప్ వేముల వీరేశం అండగా నిలుస్తున్నారని తెలిపారు. ఉద్యమకారుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరిస్తోందని, ప్రభుత్వ నాయకత్వంపై తమకు పూర్తి విశ్వాసం ఉందని చెప్పారు.
ప్రభుత్వ సలహాదారు కే.కేశవరావు నేతృత్వంలో ఇప్పటికే కమిటీ పనిచేస్తోందని పేర్కొంటూ, కొందరు ఇస్తున్న సీఎం నివాస ముట్టడి పిలుపులను తమ సంఘం సమర్థించదని స్పష్టం చేశారు. ఉద్యమకారుల ఐక్యత, సంక్షేమమే తమ సంఘం ప్రధాన లక్ష్యమని, సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంతో చర్చల ద్వారానే ముందుకు సాగుతామని కూనూరు సంజయ్ దాస్ గౌడ్ వెల్లడించారు.