పుష్కర ఘాట్ నిర్మాణ పనులకు శంకుస్థాపన
జైపూర్, (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం వేలాల గ్రామంలో మల్లన్న స్వామిని దర్శించుకుని, గోదావరి తీరంలో నీటిపారుదల- ఆయకట్టు అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో 4 కోట్ల 25 లక్షల రూపాయల వ్యయంతో పుష్కర ఘాట్ నిర్మాణ పనులకు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, మండల తహసిల్దార్ వనజ రెడ్డి, మండల పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీపతి బాపు లతో కలిసి కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకట స్వామి(Minister Vivek Venkat Swamy) శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెన్నూర్ నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుందని తెలిపారు. గోదావరి పుష్కరాల అభివృద్ధి పనుల కోసం 70 కోట్ల రూపాయలు, చెన్నూర్ లోని శివాలయ అభివృద్ధికి 17 కోట్ల రూపాయల మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. మొసళ్ల పార్కు అభివృద్ధికి నిధులు కేటాయించి, గాంధారి మైసమ్మ ఆలయం తదితర ప్రాంతాలను అనుసంధానిస్తూ పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందించడం జరుగుతుందని తెలిపారు.
జైపూర్ పవర్ ప్లాంట్ విస్తరణ ద్వారా సుమారు 5 వేల మందికి ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉందని తెలిపారు. సింగరేణి సంస్థకు చెందిన ఆర్కే ఓసీ గని ప్రారంభంతో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. మందమరిలో ఏర్పాటు చేసిన అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ ద్వారా యువతకు జర్మన్ భాషలో శిక్షణ అందించి విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ప్రస్తుతం సుమారు 70 మంది శిక్షణ పొందుతున్నారని, అర్హత సాధించిన వారికి జర్మనీలో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయడం జరుగుతుందని తెలిపారు.
చెన్నూర్ లో 100 పడకల ఆసుపత్రిని త్వరలో ప్రారంభించడం జరుగుతుందని, మందమర్రిలో 50 పడకల ఆసుపత్రి ఏర్పాటుకు ప్రతిపాదనలు సమర్పించడం జరిగిందని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా వచ్చే ఐదేళ్లలో నియోజకవర్గంలో 12 వేల నుంచి 15 వేల ఇండ్ల నిర్మాణానికి కృషి చేస్తున్నామని, ఇప్పటికే సుమారు 5 వేల ఇండ్ల నిర్మాణం చేపట్టడం జరిగిందని తెలిపారు. ఎల్నినో ప్రభావంతో ఏర్పడిన వాతావరణ పరిస్థితులను ప్రజలందరూ సమిష్టిగా ఎదుర్కోవాలని, సాగునీటి ప్రాజెక్టుల విషయంలో భద్రతా ప్రమాణాలను పాటిస్తూ ప్రజాధనాన్ని సమర్థంగా వినియోగించాలని కోరారు.