ఏదుల నుంచి శివన్నగూడెంకు జలధార!

26-10-2026 | 10:07pm
  1. రాజగోపాల్ రెడ్డి కృషితో డిండి ప్రాజెక్టుకు కీలక ముందడుగు
  2. రూ.1,800 కోట్లతో నీటి తరలింపు పనులకు పరిపాలనా అనుమతులు
  3. ప్రతిపక్షంలో పోరాటం.. అధికార పక్షంలో ప్రాజెక్టు పురోగతికి పట్టుదల
  4. మునుగోడు ఎమ్మెల్యే చొరవపై హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు

మునుగోడు, అక్టోబర్ 26 (విజయక్రాంతి): దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాల సాగునీటి కల సాకారం చేసే దిశగా డిండి ఎత్తిపోతల పథకంలో కీలక ముందడుగు పడింది. శివన్నగూడెం రిజర్వాయర్‌కు ఏదుల రిజర్వాయర్ నుంచి నీటిని తరలించే ప్రతిపాదన కార్యరూపం దాల్చే దిశగా అడుగులు పడుతుండటంతో ఈ ప్రాంత రైతాంగం, ప్రజలలో ఆశలు చిగురిస్తున్నాయి.

ఈ ప్రక్రియలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(MLA Komatireddy Rajagopal Reddy) ప్రత్యేక చొరవ తీసుకుని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చారని నియోజకవర్గ ప్రజలు ప్రశంసిస్తున్నారు. ప్రాజెక్టు నిర్మాణం నుంచి భూనిర్వాసితుల సమస్యల పరిష్కారం వరకు గతంలో ప్రతిపక్షంలో ఉండి పోరాడిన ఆయన, ప్రస్తుతం అధికార పక్షంలో ఉండి పనుల పురోగతికి కృషి చేస్తున్నారని తెలిపారు.

పదేళ్ల జాప్యం.. తీరని సాగునీటి ఆశలు!

నల్గొండ జిల్లాలోని వెనుకబడిన దేవరకొండ, మునుగోడు ప్రాంతాలకు సాగునీరు, తాగునీరు అందించాలనే లక్ష్యంతో చేపట్టిన ప్రాజెక్టుల విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తీవ్ర జాప్యం జరిగిందనే విమర్శలు ఉన్నాయి. శివన్నగూడెం రిజర్వాయర్‌కు 2015 జూన్ 12న అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేశారు. అయితే, ప్రాజెక్టుకు నీటిని ఎక్కడి నుంచి తరలించాలనే అంశం సహా కీలక సమస్యలు దీర్ఘకాలం పరిష్కారం కాకపోవడంతో పనుల ప్రయోజనాలు ప్రజలకు అందడంలో జాప్యం జరిగిందని కాంగ్రెస్ నాయకులు విమర్శిస్తున్నారు.

మరోవైపు, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి ప్రాధాన్యం ఇచ్చిన అప్పటి ప్రభుత్వం నల్గొండ జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులపై అదే స్థాయిలో దృష్టి సారించలేదనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో దేవరకొండ, మునుగోడు ప్రాంతాల రైతులు సాగునీటి కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి.

భూనిర్వాసితుల పక్షాన అసెంబ్లీలో గళం

శివన్నగూడెం రిజర్వాయర్ నిర్మాణం కోసం భూములు కోల్పోయిన రైతులకు పరిహారం చెల్లింపులోనూ జాప్యం జరిగిందనే విమర్శలు ఉన్నాయి. ఇతర ప్రాజెక్టులతో పోలిస్తే తమకు తగిన పరిహారం అందలేదని భూనిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేసిన సందర్భాలున్నాయి.ఈ సమస్యలపై అప్పట్లో ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అసెంబ్లీలో గళమెత్తారని గుర్తుచేస్తున్నారు. ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన అనంతరం భూనిర్వాసితులకు పరిహారం చెల్లించే ప్రక్రియ వేగవంతమైందని వారు పేర్కొంటున్నారు. నిర్వాసితులకు న్యాయం చేయాలనే అంశంపై ఆయన చేసిన పోరాటాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు.

ఏదుల నుంచే నీటి తరలింపునకు కృషి

శివన్నగూడెం రిజర్వాయర్‌కు నీటిని ఎక్కడి నుంచి తీసుకురావాలనే అంశం ప్రాజెక్టు పురోగతిలో కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో ఏదుల రిజర్వాయర్ నుంచి నీటిని తరలించే ప్రతిపాదనపై ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించినట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి డిండి ప్రాజెక్టు ప్రాంతాన్ని సందర్శించిన రాజగోపాల్ రెడ్డి.. ఏదుల నుంచి నీటిని తరలిస్తేనే దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాల్లోని రిజర్వాయర్లకు నీటిని అందించే అవకాశాలున్నాయని వివరించినట్లు పేర్కొన్నాయి.

ఈ అంశంపై తెలంగాణ రిటైర్డ్ ఇంజినీర్స్ ఫోరం సభ్యులతో పలుమార్లు చర్చలు నిర్వహించి, నీటి తరలింపునకు సంబంధించిన సాంకేతిక అంశాలను పరిశీలించినట్లు తెలిపాయి. అనంతరం సుమారు రూ.1,800 కోట్లతో చేపట్టనున్న నీటి తరలింపు పనులకు కేబినెట్ ఆమోదం, పరిపాలనా అనుమతులు లభించేలా ఎమ్మెల్యే కృషి చేశారని,ఈ పనులకు టెండర్లు పిలిచినట్లు, పనుల ప్రక్రియ ముందుకు సాగుతున్నట్లు పేర్కొంటున్నారు.

అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షలు

ఏదుల నుంచి శివన్నగూడెం రిజర్వాయర్‌కు నీటిని తరలించే పనుల్లో ఎలాంటి అడ్డంకులు ఎదురవుతున్నాయి? వాటిని ఎలా అధిగమించాలనే అంశాలపై రాజగోపాల్ రెడ్డి సంబంధిత నీటిపారుదల శాఖ అధికారులతో ఎప్పటికప్పుడు చర్చించారు.రిటైర్డ్ ఇంజినీరింగ్ ఫోరం సభ్యుడు శ్యాంప్రసాద్ రెడ్డితోనూ సంప్రదింపులు జరుపుతూ పనుల పురోగతిని తెలుసుకుంటున్నట్లు పేర్కొన్నారు. సాంకేతిక సమస్యలను ముందుగానే గుర్తించి పరిష్కరించడం ద్వారా ప్రాజెక్టు పనులు వేగంగా ముందుకు సాగేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని వివరించారు.

గతంలో నిర్లక్ష్యం.. ఇప్పుడు విమర్శలా?

గత పదేళ్లపాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం నల్గొండ జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడంలో తగిన చొరవ చూపలేదని కాంగ్రెస్ నాయకులు విమర్శిస్తున్నారు. అప్పట్లో అధికారంలో ఉన్న స్థానిక ప్రజాప్రతినిధులు ప్రాజెక్టుల జాప్యంపై ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయలేదని ప్రశ్నిస్తున్నారు.ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం, ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిపై విమర్శలు చేస్తున్న బీఆర్ఎస్ నాయకులు తమ హయాంలో ప్రాజెక్టుల పురోగతికి తీసుకున్న చర్యలను వివరించాలని కాంగ్రెస్ వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. 

నీళ్లు వస్తేనే రైతుల బతుకుల్లో వెలుగులు

ఏదుల నుంచి శివన్నగూడెం రిజర్వాయర్‌కు నీటి తరలింపు పనులు పూర్తయి, ప్రాజెక్టులోకి నీరు చేరితే దేవరకొండ, మునుగోడు ప్రాంతాల్లోని రైతులకు సాగునీటి లభ్యత పెరిగే అవకాశం ఉంది. తాగునీటి అవసరాలను తీర్చడంలోనూ ఈ ప్రాజెక్టు కీలక పాత్ర పోషించవచ్చనే ఆశాభావం వ్యక్తమవుతోంది.ప్రాజెక్టు పనులు సకాలంలో పూర్తయి నిర్దేశిత లక్ష్యాల మేరకు నీరు అందుబాటులోకి వస్తే వ్యవసాయ రంగానికి ఊతం లభించడంతోపాటు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి దోహదపడుతుంది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు పురోగతిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్న ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చొరవను ఆయన అనుచరులు, కాంగ్రెస్ వర్గాలు ప్రశంసిస్తున్నాయి.

మరిన్ని వార్తలు