నియోజకవర్గాన్ని కరువు ప్రభావిత ప్రాంతంగా గుర్తించాలి

31-10-2026 | 06:30pm

పంట నష్టాలు, తాగునీటి సమస్యలపై ముందస్తు చర్యలు తీసుకోవాలి

జిల్లా అదనపు కలెక్టర్‌ విక్టర్ కు బాన్సువాడ నియోజకవర్గ రైతుల ప్రజాప్రతినిధుల వినతి

బాన్సువాడ,(విజయక్రాంతి): ఎల్‌నినో ప్రభావం(El Niño impact)తో రానున్న రోజుల్లో వర్షాభావ పరిస్థితులు తీవ్రరూపం దాల్చే అవకాశం ఉన్న నేపథ్యంలో కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గ రైతుల(Farmers )ను ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని బాన్సువాడ నియోజకవర్గ రైతుల ప్రతినిధులు బిఆర్ఎస్ నాయకులు మోచి గణేష్ ఆధ్వర్యంలో జిల్లా అదనపు కలెక్టర్ వి విక్టర్(Collector V Victor)కు వినతి పత్రాన్ని అందజేశారు.

వర్షాభావ పరిస్థితులు, భూగర్భ జలాలు తగ్గిపోవడం, సాగునీటి కొరత, పంటల దిగుబడులు తగ్గే ప్రమాదం, పశువులకు మేత తాగునీటి సమస్యలను దృష్టిలో ఉంచుకొని ముందస్తు కరువు నివారణ చర్యలు చేపట్టాలని వారు కోరారు. ప్రస్తుతం వాతావరణ మార్పులు, ఎల్‌నినో ప్రభావం కారణంగా వర్షపాతం తగ్గే అవకాశాలు ఉండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో భూగర్భ జలాలు తగ్గిపోవడం, బోర్లు, బావుల్లో నీటి లభ్యత తగ్గడం వంటి సమస్యలు కనిపిస్తున్నాయని తెలిపారు.

సాగునీటి కొరత ఏర్పడితే రైతులు సాగు చేసిన పంటలు ఎండిపోయి తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.బాన్సువాడ నియోజకవర్గంలోని బాన్సువాడ, వర్ని, రుద్రూర్, చందూర్, కోటగిరి, నస్రుల్లాబాద్, బీర్కూర్, మోస్రా, పొతంగల్ తదితర మండలాల్లో రైతుల పరిస్థితిని ప్రత్యేకంగా పరిశీలించి కరువు నివారణ చర్యలు చేపట్టాలని కోరారు. వర్షాధార పంటలపై ఆధారపడిన రైతులకు ప్రత్యామ్నాయ పంటల సాగుపై వ్యవసాయ శాఖ ద్వారా అవగాహన కల్పించాలని సూచించారు.

రైతులు పంటలు సాగు చేసిన తర్వాత వర్షాభావ పరిస్థితులు ఎదురైతే తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని, అలాంటి పరిస్థితులు తలెత్తకముందే ప్రభుత్వం అప్రమత్తం కావాలని ప్రతినిధులు కోరారు. రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోకుండా, వ్యవసాయ రంగాన్ని కాపాడేందుకు ప్రత్యేక కార్యాచరణతో పాటు అవసరమైన నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.బాన్సువాడ నియోజకవర్గ రైతుల సమస్యలను దృష్టిలో ఉంచుకొని  ప్రత్యేక చొరవ తీసుకుని సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించి తక్షణ చర్యలు చేపట్టాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో బత్తిని సురేష్ , గాండ్ల ప్రవీణ్ , మంగలి రమేష్,తదితరులు పాల్గొనడం జరిగింది.

మరిన్ని వార్తలు