అల్పపీడనం ఎఫెక్ట్.. తెలంగాణలో భారీ వర్షాలు
ఐదు రోజుల పాటు Weather Alert!
హైదరాబాద్: తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారనుంది. అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలోని(Telangana Weather Aler) పలు జిల్లాల్లో రానున్న ఐదు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం (India Meteorological Department) వెల్లడించింది. అక్టోబర్ 31 నుంచి నవంబర్ 4 వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని అంచనా వేసింది. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు Yellow Alert జారీ చేసింది. వాతావరణ శాఖ నివేదిక ప్రకారం, అల్పపీడనం వాయుగుండంగా బలపడి ఆంధ్రప్రదేశ్ తీరం వైపు కదులుతోంది. దీని ప్రభావంతో అక్టోబర్ 31 సాయంత్రం ఉమ్మడి వరంగల్, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాలతో పాటు హైదరాబాద్, యాదాద్రి భువనగిరి, సిద్దిపేట ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
నవంబర్ 2, 3 తేదీల్లో భారీ వర్షాలు
నవంబర్ 1న రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని Weather Forecast పేర్కొంది. ఇక నవంబర్ 2న ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల్లో భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయని హెచ్చరించింది. నవంబర్ 3న నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్నగర్ జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మిగిలిన ప్రాంతాల్లోనూ వర్ష ప్రభావం కనిపించవచ్చని అంచనా వేసింది. వర్షాలు, ఉరుములు, మెరుపుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. పిడుగులు పడే సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాల సమీపంలో ఉండకూడదని హెచ్చరిస్తున్నారు. వర్షం పడుతున్నప్పుడు బహిరంగ ప్రదేశాల్లో ఉండకుండా సురక్షిత ప్రాంతాల్లో ఆశ్రయం పొందాలని సూచించారు. ముఖ్యంగా రైతులు, ప్రయాణికులు వాతావరణ పరిస్థితులను గమనిస్తూ తమ పనులను ప్లాన్ చేసుకోవాలని చెబుతున్నారు.