జాతీయ ఐక్యతకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి
జిల్లా కలెక్టర్ కె.హరిత
ఆసిఫాబాద్,(విజయక్రాంతి): భారతదేశ ఐక్యత, సమగ్రతను కాపాడటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ కె.హరిత(Collector K. Haritha) అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ సమావేశ మందిరంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి(Sardar Vallabhbhai Patel Birth Anniversary)ని పురస్కరించుకొని నిర్వహించిన జాతీయ ఐక్యత దినోత్సవ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులు, ఉద్యోగులతో జాతీయ ఐక్యత ప్రతిజ్ఞ చేయించారు.
కలెక్టర్ మాట్లాడుతూ... భారతదేశం విభిన్న భాషలు, సంస్కృతులు, సంప్రదాయాలకు నిలయమని, ఇలాంటి వైవిధ్యంలో ఐక్యతను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. దేశ సమగ్రత, ఐక్యతతో పాటు భద్రత, అంతర్గత భద్రతను పరిరక్షించేందుకు ప్రజలందరూ సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎం.డేవిడ్, జిల్లా రెవెన్యూ అధికారి దాసరి వేణు, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.