తుఫాను ముప్పు.. 24 గంటల్లో బలపడే అవకాశం

31-10-2026 | 04:11pm

ఆంధ్రప్రదేశ్‌కు మరోసారి తుఫాను ముప్పు (Cyclone Alert) పొంచి ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం క్రమంగా బలపడుతోంది. రానున్న 24 గంటల్లో ఇది తుఫానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది. ఈ తుఫాను నవంబర్ 2వ తేదీ సాయంత్రానికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఆంధ్రప్రదేశ్ తీరానికి సమీపంలోకి చేరుకునే అవకాశం ఉందని వెల్లడించింది.

ప్రస్తుతం ఈ వాయుగుండం మచిలీపట్నానికి ఆగ్నేయ దిశగా సుమారు 1,200 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు సమాచారం. దీని ప్రభావంతో రాష్ట్రంలో రానున్న రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు (Heavy to Very Heavy Rainfall) పడే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

మరోవైపు తుఫాను హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రధాన ఓడరేవులకు మొదటి నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లు సమాచారం. సముద్రంలో వాతావరణ పరిస్థితులు క్రమంగా మారుతున్న నేపథ్యంలో మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. నవంబర్ 1వ తేదీ నుంచి మత్స్యకారులు చేపల వేటకు సముద్రంలోకి వెళ్లరాదని ఐఎండీ హెచ్చరించింది (Fishermen Warning).

తుఫాను ప్రభావంతో సముద్రంలో అలల ఉద్ధృతి పెరగడంతోపాటు బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాతావరణ శాఖ సూచనలను పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు, రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు.

ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వాతావరణ మార్పులు కనిపిస్తున్న నేపథ్యంలో తాజా తుఫాను హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి. నవంబర్ 2, 3 తేదీల్లో వర్షాల తీవ్రత పెరిగే అవకాశం ఉండటంతో అధికార యంత్రాంగం పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తోంది. తుఫాను దిశ, తీవ్రత, ప్రభావంపై ఐఎండీ ఎప్పటికప్పుడు తాజా బులెటిన్లు విడుదల చేయనుంది.

మొత్తంగా బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం (Bay of Bengal Depression) తుఫానుగా మారితే ఏపీ తీర ప్రాంతాలపై ప్రభావం చూపే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.

మరిన్ని వార్తలు