డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ
16 రోజులైనా వీడని శ్రావణ్ మృతి మిస్టరీ.. నివేదికలు ఏమయ్యాయి?
బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదు: లంబాడి విద్యార్థి సేన
పోస్టుమార్టం, సీడీఆర్, ఫోరెన్సిక్ నివేదికలు వెంటనే అందించాలి
సూర్యాపేట,(విజయక్రాంతి): వంకుడోతు శ్రావణ్ మృతి(Vankudoth Shravan Death) చెంది 16 రోజులు గడుస్తున్నా తమకు న్యాయం జరగడం లేదని బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. పోస్టుమార్టం, సీడీఆర్, ఫోరెన్సిక్ నివేదికలపై స్పష్టత ఇవ్వాలని కోరారు. ఈ నేపథ్యంలో లంబాడి విద్యార్థి సేన(Lambadi Student Army) ఆధ్వర్యంలో శనివారం ఘటన స్థలాన్ని సందర్శించి, బాధిత కుటుంబంతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా ఉపాధ్యక్షుడు లకావత్ వీరన్న నాయక్ మాట్లాడుతూ.. కీలక నివేదికలను బాధిత కుటుంబానికి అందించి, కేసుపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. దర్యాప్తు పురోగతిని కుటుంబ సభ్యులకు తెలియజేయాలని కోరారు. నివేదికల విషయంలో జాప్యం కొనసాగితే ఎస్పీ, కలెక్టర్ కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. శ్రావణ్ మృతి వెనుక ఉన్న వాస్తవాలను వెలుగులోకి తీసుకువచ్చి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకునే వరకు పోరాటం కొనసాగిస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ధారావత్ రవి నాయక్, జిల్లా అధ్యక్షుడు హరీష్ నాయక్, జిల్లా ఉపాధ్యక్షుడు లకావత్ వీరన్న నాయక్, ధరావత్ శివ నాయక్, సుమన్ నాయక్, నరసింహ, రమేష్ నాయక్, భూక్య చంటి నాయక్, బాలాజీ, వెంకన్న నాయక్, రమేష్, వంకుడోత్ గాంధీ, బల్లు తండా సర్పంచ్ భూక్య మల్సూర్, సపావత్ ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు. సుమారు 50 మంది కుటుంబ సభ్యులు, గ్రామస్తులు సంఘీభావం తెలిపారు.