అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందేలా చూడాలి
- క్షేత్రస్థాయి పర్యటనలో అధికారులకు జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శ్రీలత రెడ్డి సూచన
- గుంతపల్లి, మజీద్‌పూర్, బాటసింగారం గ్రామాల్లో ప్రభుత్వ పథకాల అమలు పరిశీలన
అబ్దుల్లాపూర్‌మెట్: ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన లబ్ధిదారులకు సక్రమంగా అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి (డీఆర్డీఓ) శ్రీలత రెడ్డి సూచించారు. శనివారం అబ్దుల్లాపూర్‌మెట్ మండల పరిధిలోని గుంతపల్లి, మజీద్‌పూర్, బాటసింగారం గ్రామాల్లో ఆమె క్షేత్రస్థాయి పర్యటన నిర్వహించి వివిధ ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలు తీరును పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో పింఛన్ లబ్ధిదారుల అర్హతలు, సంబంధిత రికార్డులను తనిఖీ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు యూనిఫామ్‌ల పంపిణీ, మహిళా స్వయం సహాయక సంఘాల (వీఓ) భవనాల స్థితిగతులు, వినియోగాన్ని పరిశీలించారు. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు అందిస్తున్న పౌష్టికాహారం నాణ్యత, పంపిణీ విధానంపై ఆరా తీశారు. అలాగే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల పురోగతి, లబ్ధిదారుల వివరాలను పరిశీలించడంతో పాటు వీబీ-జీ రామ్ జీ పథకం కింద గ్రామాల్లో చేపడుతున్న పనుల అమలు తీరు, పురోగతి, సంబంధిత రికార్డులను తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా శ్రీలత రెడ్డి మాట్లాడుతూ... సంక్షేమ పథకాల అమలులో అర్హులైన వారికే ప్రాధాన్యత కల్పించాలని, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు ప్రతి ఒక్కరికీ చేరేలా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేపట్టాలని అధికారులకు సూచించారు. గ్రామాల్లో చేపడుతున్న అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలతో నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మండల సంబంధించిన అధికారులు, గ్రామస్థాయి అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.