ఎస్టీ కమిషన్ సభ్యుడి పర్యటనకు పక్కా ఏర్పాట్లు చేయాలి
అన్ని శాఖల అధికారులు సమగ్ర నివేదికలు సిద్ధం చేయాలి
భూపాలపల్లి, అక్టోబర్ 09 (విజయ క్రాంతి): జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్(National Commission for Scheduled Tribes) సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్(Jatoth Hussain Naik) ఈ నెల 13న జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు సమగ్ర సమాచారంతో నివేదికలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ(District Collector Rahul Sharma) ఆదేశించారు. శుక్రవారం నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో కలెక్టర్ మాట్లాడుతూ శాఖల వారీగా పూర్తి వివరాలను ఎలాంటి లోటుపాట్లు లేకుండా సిద్ధం చేసి, వీలైనంత త్వరగా జిల్లా గిరిజన అభివృద్ధి అధికారికి అందించాలని సూచించారు.
ఆయా శాఖల నుంచి వచ్చిన సమాచారంతో సమగ్ర నివేదిక(Comprehensive Report) రూపొందించాలని గిరిజన సంక్షేమ శాఖ(Tribal Welfare Department) అధికారిని ఆదేశించారు. కమిషన్ సభ్యుడి పర్యటనను అత్యంత ప్రాధాన్యంగా తీసుకొని నిర్ణీత గడువులో నివేదికలు సమర్పించాలని స్పష్టం చేశారు.ఈ టెలీకాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, కాటారం సబ్ కలెక్టర్ సౌరవ్ శర్మ, ఏఎస్పీ నరేశ్ కుమార్, ఆర్డీవో హరికృష్ణ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.