ఘనంగా ముగిసిన జిల్లా స్థాయి యువ టూరిజం క్లబ్స్ పోటీలు
భూపాలపల్లి టౌన్, సెప్టెంబర్ 22 ( విజయ క్రాంతి ) : తెలంగాణ ప్రభుత్వ పర్యాటక శాఖ (Telangana Government Tourism Department)ఆదేశానుసారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ అనుమతితో, జిల్లా టూరిజం నోడల్ అధికారి శ్రీమతి ఎల్ విజయలక్ష్మి, అదనపు కలెక్టర్, జిల్లా టూరిజం అధికారి రఘు ఆధ్వర్యంలో జిల్లాలో నిర్వహించిన జిల్లా స్థాయి యువ టూరిజం క్లబ్స్ పోటీలు 2026 అత్యంత వైభవంగా విజయవంతంగా ముగిసాయి. ప్రపంచ పర్యాటక దినోత్సవం 2026 పురస్కరించుకుని యువతలో పర్యాటకంపై అవగాహన, నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకు ఈ పోటీలను నిర్వహించారు.
ఈ ఏడాది వేడుకలను డిజిటల్ అజెండా అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టు రీడిజైన్ టూరిజం, ప్రమోటింగ్ హెరిటేజ్ అండ్ కమ్యూనిటీ అనే ముఖ్యమైన ఇతివృత్తాలతో నిర్వహించగా సంస్కృతి, చారిత్రక కట్టడాల వైభవాన్ని చాటిచెబుతూ విద్యార్థులు తమ సృజనాత్మకతను, ప్రతిభను కనబరిచారు. ఈ జిల్లా స్థాయి పోటీలలో ప్రథమ స్థానాల్లో నిలిచి విజేతలుగా ఎంపికైన విజేతలు రాష్ట్ర స్థాయి యువ టూరిజం క్లబ్స్ పోటీలలో జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు. ఈ సందర్భంగా జిల్లా పర్యాటక శాఖ అధికారి మాట్లాడుతూ మన సంస్కృతిని కాపాడుకోవడానికి యువత భాగస్వామ్యం ఎంతో అవసరమని పేర్కొన్నారు. జిల్లా స్థాయి విజేతలకు బహుమతులను అందజేశారు.