పట్టాదారు పాస్ పుస్తకాల కోసం తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా

22-09-2026 | 10:51pm

* దశాబ్దాలుగా తిప్పుకుంటున్నారని బాధితుల ఆవేదన

* మద్దతు తెలిపిన ప్రజా కళాకారుడు బాదే నరసయ్య

గరిడేపల్లి సెప్టెంబర్ 22 (విజయక్రాంతి): పట్టాదారు పాస్ పుస్తకాలు మంజూరు చేయకుండా దశాబ్దాలుగా అధికారులు తిప్పుకుంటున్నారని ఆరోపిస్తూ బాధితులు మంగళవారం గరిడేపల్లి తహశీల్దార్ కార్యాలయం(Tahsildar office) ఎదుట రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ప్రజా కళాకారుడు బాదే నరసయ్య దీక్షకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెలిదండ రెవెన్యూ పరిధిలోని 502 సర్వే నంబర్‌లోని భూమిని భానోత్ లక్ష్మయ్య 1980 నుంచి సాగు చేసుకుంటున్నప్పటికీ ఇప్పటివరకు పట్టాదారు పాస్ పుస్తకం మంజూరు చేయలేదన్నారు.

అలాగే కీతవారిగూడెంకు చెందిన జ్యోతి, దూత ప్రియాంక, నర్సింగు బక్కయ్య, మర్రికుంటకు చెందిన ఉల్లెందుల వెంకటయ్య, తదితరులు పాస్ పుస్తకాల కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నారని తెలిపారు. కొందరు బాధితులు పాస్ పుస్తకాలు పొందకుండానే మృతి చెందారని ఆవేదన వ్యక్తం చేశారు. అర్హులైన బాధిత రైతులకు తక్షణమే పట్టాదారు పాస్ పుస్తకాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.దీక్ష చేసిన బాధితులు పార్వతి, లక్ష్మయ్య, రుక్కమ్మ, కవిత, గోపి, త్రిష, వెంకన్న, సైదులు తదితరులు పాల్గొన్నారు.

తహశీల్దార్ స్రవంతి వివరణ

కోర్టు ఆదేశాలు ఉన్న భూముల విషయంలో చట్టపరమైన ప్రక్రియలను పాటిస్తూ, రెవెన్యూ రికార్డులను సమగ్రంగా పరిశీలించిన అనంతరం అర్హులైన బాధితులకు పట్టాదారు పాస్ పుస్తకాల మంజూరుకు కృషి చేస్తామని తహశీల్దార్ స్రవంతి తెలిపారు.

మరిన్ని వార్తలు