తాగునీరు తప్ప.. సాగునీరు లేదు
హైదరాబాద్: నీటి అంశంపై కర్ణాటక ప్రభుత్వం(Government of Karnataka)తో చర్చిస్తున్నామని, కర్ణాటక ముఖ్యమంత్రికి లేఖ కూడా రాశామని మంత్రి జూపల్లి కృష్ణారావు(Minister Jupally Krishna Rao) పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రానికి నీళ్లు రాబోతున్నాయని తెలుసే, బీఆర్ఎస్ హడావుడి చేస్తోందని, రైతులను పక్కదారి పట్టించేందుకు బీఆర్ఎస్(BRS) ప్రయత్నిస్తోందని ఆయన మండిపడ్డారు. రైతులకు నీళ్లు ఇవ్వడానికి మాకు అభ్యంతరం లేదని, జూరాలలో తాగునీరు తప్ప సాగునీరు లేదన్నారు.
రైతులపై బీఆర్ఎస్ ప్రేమ నటిస్తోందని, రైతులకు ఈ దుస్థితి రావడానికి బీఆర్ఎస్సే కారణమని మంత్రి జూపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రాజెక్టులు పూర్తి చేసి ఉంటే ఇవాళ ఈ పరిస్థితి ఉండేది కాదని, బీఆర్ఎస్ హయంలో కృష్ణా జాలాల్లో ఆంధ్రప్రదేశ్ 70 శాతం వాడుకుందని ఆయన చెప్పారు. బీఆర్ఎస్ హయంలో వాడిన నీటికంటే ఇప్పుడు తక్కువ నీళ్లు ఉన్నప్పటికీ మనం 40 శాతం వాడుకున్నామని, నాడు తెలంగాణకు 299 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్ కి 512 టీఎంసీలు ఇచ్చారని, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం వల్లే ఏపీకి ఎక్కువ నీళ్లు వెళ్తున్నాయని మంత్రి జూపల్లి వెల్లడించారు.