కాటారం ఏటీసీతో యువతకు ఆధునిక నైపుణ్యాలు

22-09-2026 | 11:06pm

విద్యార్థులకు యూనిఫాం, షూస్‌ సొంత ఖర్చుతో అందిస్తా

మంథని నియోజకవర్గంలోని కాటారం ఎంపీటీసీ విద్యార్థుల తో మంత్రి శ్రీధర్ బాబు

మంథని, కాటారం, సెప్టెంబర్ 22 (విజయక్రాంతి): పారిశ్రామిక రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యార్థులకు ఆధునిక సాంకేతిక నైపుణ్యాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Minister Duddilla Sridhar Babu) అన్నారు. మంగళవారం మంథని నియోజకవర్గంలోని  కాటారం మండల కేంద్రంలోని అధునాతన శిక్షణ కేంద్రాన్ని సందర్శించిన మంత్రి శిక్షణ పొందుతున్న విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 100 అధునాతన శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని, తొలి విడతలో 65 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కాటారం ఏటీసీలో తొలి ఏడాదిలోనే 172 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందడం అభినందనీయమన్నారు.

పాత కోర్సులకే పరిమితం కాకుండా రోబోటిక్స్, బ్యాటరీ తయారీ, ఆధునిక యంత్రాల వినియోగం వంటి భవిష్యత్‌ ఉపాధి రంగాల్లో శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులకు మెరుగైన సాంకేతిక విద్య, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఏటీసీ విద్యార్థులకు యూనిఫాం, షూస్‌ను తన సొంత ఖర్చుతో అందిస్తానని మంత్రి ప్రకటించారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు.

మరిన్ని వార్తలు