భగత్‌సింగ్ స్ఫూర్తితో యుద్ధోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడాలి
బోధన్, సెప్టెంబర్ 22 (విజయక్రాంతి): యుద్ధోన్మాదం, సామ్రాజ్యవాద ఆధిపత్య ధోరణులకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్య, ప్రగతిశీల శక్తులు ఐక్యంగా పోరాడాలని సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ బోధన్ డివిజన్ కమిటీ సహాయ కార్యదర్శి బి. మల్లేష్ పిలుపునిచ్చారు. మంగళవారం బోధన్ పట్టణం(Bodhan Town)లోని బీటీ నగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పీడీఎస్‌యూ, పీవైఎల్, పీఓడబ్ల్యూ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. అమెరికా ఆధిపత్య ధోరణులు, యుద్ధోన్మాదానికి వ్యతిరేకంగా ప్రజలు ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు.
షాహిద్ భగత్‌సింగ్ చూపిన ధైర్యం, త్యాగం, సామాజిక మార్పు కోసం సాగించిన పోరాట స్ఫూర్తిని యువత, విద్యార్థులు, మహిళలు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ప్రపంచ శాంతి, ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం కోసం ప్రజల ఐక్య పోరాటాలను మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. సదస్సుకు పీఓడబ్ల్యూ పట్టణ అధ్యక్షురాలు బి. నాగమణి అధ్యక్షత వహించారు.