జర్నలిస్టులకు 'ఎస్వీఎస్' ఉచిత హెల్త్ మాస్టర్ చెకప్
- పాలమూరు జర్నలిస్టుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో యాజమాన్యానికి వినతి
- అక్టోబర్ 1నుంచి వైద్య పరీక్షలు
మహబూబ్ నగర్, సెప్టెంబర్ 22 : పాలమూరు జర్నలిస్టుల సంక్షేమ సంఘం(Palamuru Journalists Welfare Association) మరో అడుగు ముందుకు వేసింది. జర్నలిస్టులు, వారి జీవిత భాగస్వాములకు ఉచితంగా మాస్టర్ హెల్త్ చెకప్, వైద్య, రక్త పరీక్షలు నిర్వహించాలని కోరుతూ మంగళవారం ఎస్వీఎస్ ఆసుపత్రి, మెడికల్ కాలేజ్ యాజమాన్యానికి సంఘం వినతిపత్రం సమర్పించింది. ఆసుపత్రి డైరెక్టర్, ఇన్చార్జి రామ్‌రెడ్డికి సంఘం ప్రతినిధులు వినతిపత్రాన్ని అందజేశారు.
దీనిపై ఆయన సానుకూలంగా స్పందిస్తూ జర్నలిస్టులు, వారి జీవిత భాగస్వాములకు మాస్టర్ హెల్త్ చెకప్ నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు హామీ ఇచ్చారు. అక్టోబర్ 1 నుంచి పరీక్షలు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని, రోజుకు సుమారు 20 జర్నలిస్టు కుటుంబాలకు పరీక్షలు నిర్వహించే విధంగా ఏర్పాట్లు చేస్తామని రామ్‌రెడ్డి తెలిపారు.
జర్నలిస్టులకు వైద్యపరంగా ఎస్వీఎస్ సంస్థ మొదటి నుంచీ సహకారం అందిస్తోందని, గత ఏడాది నుంచే ఫ్యామిలీ హెల్త్ చెకప్‌కు అవకాశం కల్పించినప్పటికీ ఆశించిన స్థాయిలో జర్నలిస్టులు ముందుకు రాలేదని ఆయన అన్నారు. ఇటీవల మృతి చెందిన జర్నలిస్టు కె. శ్రీనివాసులు పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్వీఎస్ యాజమాన్యానికి పాలమూరు జర్నలిస్టుల సంక్షేమ సంఘం కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు రమాకాంత్ రెడ్డి, సతీష్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, జిల్లెల రఘు, భాస్కర చారి, అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.