ఆలయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత
జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్
జగిత్యాల, నవంబర్ 05 ( విజయ క్రాంతి ) జగిత్యాల మండలం పొలాస గ్రామ ప్రముఖ ప్రాచీన పుణ్యక్షేత్రం(prominent ancient pilgrimage site) శ్రీ పౌలేస్తేశ్వర స్వామి ఆలయంలో జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ స్వామి(Jagtial MLA Dr. Sanjay Kumar Swami) వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించినారు.
ఈ సందర్భంగా జగిత్యాల ఎమ్మెల్యే కు ఆలయ అర్చకులు, ఈవో ఆశీర్వచనాలు, తీర్థ ప్రసాదాలు అందజేసి సత్కరించినారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ పరమేశ్వరుడి, ప్రజల ఆశీస్సులతో ఎమ్మెల్యేగా గెలుపొందానని, జగిత్యాల నియోజకవర్గంలోని ఆలయాల అభివృద్ధికి తన వంతుగా నిరంతరం కృషి చేస్తున్నానని అన్నారు.
పొలాస గ్రామంలోని శ్రీ పోలాస పౌలేస్తేశ్వర స్వామి ఆలయంలో కళ్యాణ మండపం, ప్రహరీ నిర్మాణం తదితర అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వం, దాతల సహకారంతోనే ఆలయాల అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. గతంలో ఆలయాల అభివృద్ధిని విస్మరించారని, తాను ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన అనంతరం జగిత్యాల నియోజకవర్గంలోని అన్ని ఆలయాలకు నిధులు మంజూరు చేయించి అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నానని అన్నారు.
అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా నిరంతరం పనిచేస్తానని స్పష్టం చేశారు. అలాగే పొలాస గ్రామంలో సుమారు 50 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయని, ఇందిరమ్మ ఇళ్ల మంజూరుతో గ్రామగ్రామాన పండుగ వాతావరణం నెలకొందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ఎల్‌నినో ప్రభావం పై కొందరు కావాలని రాష్ట్ర ప్రభుత్వం పై అసత్య ప్రచారాలు చేస్తున్నారని ప్రపంచ వ్యాప్తంగా ప్రభావం ఉందని అన్నారు. ప్రజలు, రైతులు ఎలాంటి ఆందోళనకు గురికాకుండా నీటిని, విద్యుత్‌ను పొదుపుగా వినియోగించాలని సూచించారు. రానున్న రోజుల్లో వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రైతులు ఆరుతడి పంటలను మాత్రమే సాగు చేయాలని సూచించారు.
ప్రకృతి పరిస్థితులకు అనుగుణంగా పంటల సాగుపై రైతులు ముందస్తు ప్రణాళికతో వ్యవహరించాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శంకర్, ఏఎంసీ చైర్మన్ గడ్డం నారాయణరెడ్డి, ఆలయ చైర్మన్ భూమన్న, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాల ముకుందం, జైరాం, సురేష్, సత్యనారాయణ గౌడ్, తిరుపతి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.