సచిన్ రికార్డుపై జో రూట్ గురి

05-11-2026 | 11:48am

సచిన్‌ను దాటేందుకు రూట్‌కు 1,643 పరుగులే.. మాస్టర్ ఏమన్నాడంటే

వన్డేల్లోనూ మార్పులు కావాలి.. సచిన్ కొత్త ప్రతిపాదన ఇదే!

టెస్టు క్రికెట్‌లో అత్యధిక పరుగుల రికార్డుపై ఆసక్తికర చర్చ మొదలైంది. ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ ప్రస్తుతం 14,278 పరుగులతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. అగ్రస్థానంలో ఉన్న భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డును అధిగమించేందుకు రూట్ మరో 1,643 పరుగులు సాధించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో Redditలో జరిగిన Ask Me Anything (AMA) సెషన్‌లో సచిన్‌కు ఓ అభిమాని ఆసక్తికర ప్రశ్న వేశాడు. త్వరలోనే జో రూట్ తన టెస్టు పరుగుల రికార్డును బద్దలు కొట్టే అవకాశం ఉందని, దీనిపై మీ అభిప్రాయమేంటని అడిగాడు. దీనికి సచిన్ ఎంతో సానుకూలంగా స్పందించాడు. రూట్‌ను ప్రశంసించిన మాస్టర్ బ్లాస్టర్.. అతడిని ఎప్పుడూ గొప్ప ఆటగాడిగానే చూస్తానని చెప్పాడు. తొలి టెస్టు మ్యాచ్ ఆడినప్పుడే రూట్ భవిష్యత్తులో స్టార్ క్రికెటర్‌గా ఎదుగుతాడని గుర్తించినట్లు వెల్లడించాడు. తన రికార్డును రూట్ అధిగమిస్తే బాధపడటం కంటే సంతోషిస్తానని పేర్కొన్నాడు. విదేశీ క్రికెటర్లలో జో రూట్, హ్యారీ బ్రూక్, స్టీవ్ స్మిత్ తనకు ఇష్టమైన ఆటగాళ్లని, వీరు టెస్టు క్రికెట్ సంప్రదాయాన్ని నిలబెడుతున్నారని అభిప్రాయపడ్డాడు.

రూట్ టెస్టు అరంగేట్రం సచిన్‌తోనే..

2012లో నాగ్‌పూర్ వేదికగా భారత్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో జో రూట్ అరంగేట్రం చేశాడు. ఆ మ్యాచ్‌లో సచిన్ కూడా భారత జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో 73 పరుగులు చేసిన రూట్, రెండో ఇన్నింగ్స్‌లో 20 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది.

వన్డేల్లోనూ మార్పులు కావాలన్న సచిన్

ఇదే AMA సెషన్‌లో సచిన్ వన్డే క్రికెట్‌లో మార్పులపై తన పాత ప్రతిపాదనను మరోసారి తెరపైకి తెచ్చాడు. 50 ఓవర్ల మ్యాచ్‌ను రెండు 25 ఓవర్ల ఇన్నింగ్స్‌లుగా విభజించాలని సూచించాడు. అయితే ప్రతి జట్టుకు మొత్తం 50 ఓవర్లకు కలిపి 10 వికెట్లు మాత్రమే ఉండాలని, ఒకే బంతిని ఉపయోగించాలని ప్రతిపాదించాడు. ఈ విధానం అమల్లోకి వస్తే బ్యాట్, బాల్ మధ్య పోటీ మరింత సమతుల్యంగా ఉంటుందని సచిన్ అభిప్రాయపడ్డాడు. ముఖ్యంగా Dew Factor కారణంగా రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ జట్టుకు కలిగే అదనపు ప్రయోజనం తగ్గుతుందని వివరించాడు. బౌలర్ల ప్రాధాన్యం తగ్గిపోకముందే వన్డే ఫార్మాట్‌లో మార్పులపై ఆలోచించాల్సిన అవసరం ఉందని సూచించాడు.

మరిన్ని వార్తలు