ఉద్యోగుల బడ్జెట్లో భారీ కోత
ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగం వేగంగా పెరుగుతోంది. ప్రముఖ టెక్ కంపెనీలు తమ కార్యకలాపాల్లో ఏఐ టూల్స్(AI Tools)కు పెద్దపీట వేస్తున్నాయి. అయితే ఈ టెక్నాలజీ వినియోగంతో పెరుగుతున్న ఖర్చులను నియంత్రించడంపైనా దృష్టి సారిస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలో ఐఫోన్ తయారీ సంస్థ యాపిల్(Apple) చేరినట్లు తెలుస్తోంది.
బ్లూమ్‌బర్గ్ నివేదిక ప్రకారం.. ఉద్యోగులు ఏఐ టూల్స్ వినియోగించేందుకు కేటాయించిన రోజువారీ బడ్జెట్‌ను యాపిల్ తగ్గిస్తోంది. కొంతమంది ఇంజినీర్లకు గతంలో రోజుకు 300 డాలర్లుగా ఉన్న పరిమితిని 200 డాలర్లకు తగ్గించినట్లు సమాచారం. భారత కరెన్సీలో ఇది సుమారు రూ.28 వేల నుంచి రూ.18 వేల స్థాయికి తగ్గినట్లవుతుంది.
అంతేకాదు, భవిష్యత్తులో ఈ పరిమితులను మరింత తగ్గించే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. కొన్ని విభాగాల్లో రోజువారీ ఏఐ ఖర్చులను 25 డాలర్లకు పరిమితం చేసే ప్రతిపాదన కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఉద్యోగులకు అదనపు బడ్జెట్ అవసరమైతే సంబంధిత ఉన్నతాధికారుల అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని సమాచారం.
యాపిల్ ఉద్యోగులు తమ పనుల కోసం ChatGPT, Claude, Gemini వంటి ప్రముఖ ఏఐ టూల్స్‌ను వినియోగిస్తున్నారు. వీటి ద్వారా కోడింగ్, పరిశోధన, ఇతర పనులను వేగంగా పూర్తి చేస్తున్నారు. అయితే వీటి వినియోగానికి అయ్యే వ్యయాన్ని తగ్గించుకోవడమే తాజా నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది.
యాపిల్ మాత్రమే కాకుండా మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఉబర్, మెటా, టెస్లా, యాక్సెంచర్ వంటి సంస్థలు కూడా ఏఐ వినియోగ వ్యయాలపై నియంత్రణ చర్యలు చేపడుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.
ఒకవైపు ఏఐ టెక్నాలజీ కోసం భారీగా పెట్టుబడులు పెడుతూనే.. మరోవైపు దాని వినియోగానికి అయ్యే ఖర్చులను తగ్గించుకోవడం ఇప్పుడు టెక్ కంపెనీలకు కీలకంగా మారింది. దీంతో భవిష్యత్తులో ఉద్యోగుల ఏఐ టూల్స్ వినియోగంపై మరిన్ని పరిమితులు వచ్చే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది.