టెక్ ఉద్యోగులకు మరో షాక్

05-11-2026 | 05:23pm

ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ కంపెనీలు(Technology companies) తమ నిర్వహణ వ్యయాలను తగ్గించుకునే పనిలో పడ్డాయి. ఇందుకోసం ఉద్యోగుల సంఖ్యను క్రమబద్ధీకరించడంతో పాటు స్వచ్ఛంద పదవీ విరమణ పథకాలను కూడా అమలు చేస్తున్నాయి. ఇప్పటికే గూగుల్, మైక్రోసాఫ్ట్(Microsoft) వంటి దిగ్గజాలు ఈ తరహా ఆఫర్లను ప్రకటించగా.. తాజాగా మెటా కూడా అదే దారిలో అడుగులు వేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఆంగ్ల మీడియా కథనాల ప్రకారం.. మెటా ఫ్రాన్స్‌(Meta France)లో పనిచేస్తున్న ఉద్యోగుల కోసం వాలంటరీ ఎగ్జిట్ ఆప్షన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అక్కడ సంస్థకు సుమారు 300 మంది ఉద్యోగులు ఉండగా.. వారిలో దాదాపు 100 మంది వరకు ఈ నిర్ణయం ప్రభావానికి గురయ్యే అవకాశం ఉందని సమాచారం.

అయితే ఏ విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందనే అంశంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. స్వచ్ఛందంగా సంస్థ నుంచి వైదొలగాలనుకునే ఉద్యోగులు నవంబర్ 5లోపు దరఖాస్తు చేసుకోవాలని గడువు విధించినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. ఈ ప్రతిపాదనపై ట్రేడ్ యూనియన్లతోనూ చర్చలు జరిగినట్లు తెలుస్తోంది.

ఖర్చుల నియంత్రణలో భాగంగా గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ కూడా పలు దేశాల్లోని ఉద్యోగులకు వాలంటరీ ఎగ్జిట్ అవకాశాన్ని కల్పించినట్లు సమాచారం. కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, స్విట్జర్లాండ్‌లలో ఈ తరహా కార్యక్రమాలను చేపట్టింది.

మరోవైపు మైక్రోసాఫ్ట్ సైతం ఉద్యోగుల(Employees

) స్థాయి, విభాగాలను బట్టి స్వచ్ఛందంగా సంస్థను వీడే అవకాశాలను ప్రకటించింది. దీంతో ప్రపంచ టెక్ రంగంలో ఉద్యోగుల పునర్వ్యవస్థీకరణ అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. టెక్ కంపెనీల్లో ఈ మార్పులు ఎక్కడికి దారితీస్తాయో.. రాబోయే రోజుల్లో ఉద్యోగులపై ఎలాంటి ప్రభావం చూపుతాయో చూడాలి.

మరిన్ని వార్తలు