ఖానాపూర్‌కు బస్సు నడపాలని ఆర్టీసీ ఆర్ఎంకు వినతి

29-10-2026 | 07:34pm

మల్లాపూర్, అక్టోబర్ 29 (విజయక్రాంతి): మల్లాపూర్ మండలంలోని గుండంపల్లి గ్రామం(Gundampalli Village) మీదుగా ఖానాపూర్ వరకు ఆర్టీసీ బస్సు నడిపేందుకు గ్రామ సర్పంచ్ దప్పుల పద్మా నర్సయ్య ఆర్టీసీ కరీంనగర్ ఆర్ఎం రాజు కు వినతి పత్రం ఇవ్వగా ఆయన సానుకూలంగా స్పందించిన్నట్లు సర్పంచ్ తెలిపారు.

గుండంపల్లి గ్రామ ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో గ్రామ సర్పంచ్ దప్పుల పద్మా నర్సయ్య ఆర్టీసీ అధికారులకు వినతిపత్రం అందజేశారు. జువ్వాడి నర్సింగరావు, కృష్ణారావు ఆదేశాల మేరకు, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు సంబంధించిన లేఖతో కరీంనగర్‌లోని ఆర్టీసీ ఆర్ఎం రాజును కలిసి గ్రామ ప్రజల రవాణా సమస్యలను వివరించారు.

కోరుట్ల డిపో నుంచి గుండంపల్లి, మల్లాపూర్ మీదుగా ఖానాపూర్ వరకు బస్సు సర్వీసు నడపాలని విజ్ఞప్తి చేశారు.అలాగే కోరుట్ల నుంచి గుండంపల్లికి వచ్చే బస్సు సర్వీసులను అదనంగా ఉదయం 11 గంటలకు, రాత్రి 8 గంటలకు అందుబాటులో ఉంచాలని కోరారు.

దీంతో పాటు మెట్‌పల్లి డిపో నుంచి రాయికల్‌కు వెళ్లే ప్రతి బస్సును గుండంపల్లి గ్రామం మీదుగా నడిపేలా చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ అధికారులను విజ్ఞప్తి చేశారు.గ్రామ ప్రజలకు మెరుగైన బస్సు సౌకర్యం కల్పించేందుకు చేసిన విజ్ఞప్తులపై ఆర్టీసీ ఆర్ఎం రాజు సానుకూలంగా స్పందించడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు