ఖైరతాబాద్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

12-09-2026 | 05:00am

బడా గణేశుడి ప్రతిష్టాపన నేపథ్యంలో నిర్ణయం

నేటి నుంచి 12 రోజులపాటు అమలు

ఉదయం 11 గంటల నుంచి వాహనాల మళ్లింపు

ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని ట్రాఫిక్ పోలీసుల సూచన

ఖైరతాబాద్, సెప్టెంబర్ 11 (విజయక్రాంతి): ప్రసిద్ధ ఖైరతాబాద్(Khairatabad) బడా గణేష్ విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలో భారీగా ట్రాఫిక్ ఆంక్షలు(Traffic restrictions) విధించారు. స్వామివారి దర్శనానికి ప్రతిరోజూ వేలాదిగా తరలివచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని నేటి నుంచి సెప్టెంబర్ 24 వరకు 12 రోజులపాటు నగరంలో ట్రాఫిక్ మళ్లింపులు అమలులో ఉంటాయని హైదరాబాద్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్) డి. జోయెల్ డేవిస్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతిరోజూ ఉదయం 11:00 గంటల నుంచి రాత్రి వరకు రద్దీని బట్టి ఈ డైవర్షన్లు ఉంటాయని ప్రకటనలో పేర్కొన్నారు.

ప్రధాన ట్రాఫిక్ మళ్లింపులు..

వీవీ విగ్రహం వైపు నుంచి రాజీవ్ గాంధీ విగ్రహం మీదుగా మింట్ కాంపౌండ్ వైపు వెళ్లే సాధారణ వాహనాలను అనుమతించరు. వీటిని రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద నిరంకారి జంక్షన్ వైపు మళ్లిస్తారు. పాత పీఎస్ సైఫాబాద్ వైపు నుంచి రాజ్ దూత్ లేన్ మీదుగా బడా గణేష్ వైపు వెళ్లే వాహనాలను రాజ్ దూత్ లేన్ వద్ద ఇక్బాల్ మినార్ వైపు దారి మళ్లిస్తారు.

ఇక్బాల్ మినార్ వైపు నుంచి మింట్ కాంపౌండ్ మీదుగా ఐమ్యాక్స్ థియేటర్ వైపు వెళ్లే వాహనాలను మింట్ కాంపౌండ్ లైన్ వద్ద సెక్రటేరియట్ ఎక్స్ రోడ్డు వైపు మళ్లిస్తారు. నెక్లెస్ రోటరీ వైపు నుంచి మింట్ కాంపౌండ్ వైపు వెళ్లే ట్రాఫిక్ను నెక్లెస్ రోటరీ వద్ద సెక్రటేరియట్ జంక్షన్ లేదా ఖైరతాబాద్ ఫ్లైఓవర్ వైపు పంపుతారు. నిరంకారి వైపు నుంచి ఖైరతాబాద్ పోస్ట్ ఆఫీస్ లేన్ మీదుగా ఖైరతాబాద్ రైల్వే గేట్ వైపు వెళ్లే వాహనాలను పోస్ట్ ఆఫీస్ వద్ద పాత పీఎస్ సైఫాబాద్ జంక్షన్ వైపు మళ్లిస్తారు.

రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలు..

భక్తుల తాకిడి ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున ఖైరతాబాద్, షాదాన్ కాలేజ్, అయోధ్య, నిరంకారి, పాత పీఎస్ సైఫాబాద్, మింట్ కాంపౌండ్, ఎన్టీఆర్ మార్గ్, సెక్రటేరియట్ జంక్షన్, నెక్లెస్ రోటరీ, కేసీపీ జంక్షన్, మాసాబ్ ట్యాంక్ ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడే అవకాశం ఉంది.  ప్రయాణికులు ఈ మార్గాలకు దూరంగా ఉండాలని అధికారులు సూచించారు.

భక్తుల వాహనాలకు పార్కింగ్ స్థలాలు..

నెక్లెస్ రోటరీ, ఎన్టీఆర్ గార్డెన్ వైపు నుంచి వచ్చే భక్తులు తమ వాహనాలను రేస్ కోర్స్ రోడ్, ఎన్టీఆర్ ఘాట్, ఐమ్యాక్స్ థియేటర్ పక్కన ఉన్న హెచ్‌ఎండీఏ పార్కింగ్ స్థలం, ఐమ్యాక్స్ థియేటర్ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో పార్కింగ్ చేసుకోవచ్చుని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఖైరతాబాద్ జంక్షన్ వైపు నుంచి వచ్చే భక్తులు తమ వాహనాలను విశ్వేశ్వరయ్య భవన్లో పార్కింగ్ చేసుకునేందుకు సదుపాయం కల్పించామన్నారు.

ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలి..

రద్దీ పరిస్థితులకు అనుగుణంగా ఆంక్షలు అమలవుతాయని, ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుని నిబంధనలు పాటించాలని ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డేవిస్ కోరారు. ప్రయాణ వేళల్లో అత్యవసర సహాయం, ట్రాఫిక్ సమాచారం కోసం హెల్ప్లైన్ నంబర్ 90102 03626 ను సంప్రదించవచ్చని తెలియజేశారు.

మరిన్ని వార్తలు