కాసాలలో పడకేసిన పారిశుధ్యం!

12-09-2026 | 08:35am

‘పల్లె ప్రగతి’కి కార్యదర్శి బాధ్యారాహిత్యపు గండి

బహిరంగంగానే చెత్త కుప్పలు...నిరుపయోగంగా డంపింగ్ యార్డు

​హత్నూర: ప్రభుత్వం స్వచ్ఛత కోసం ప్రతి నెలా నిధులు మంజూరు చేస్తున్నా, అధికారుల నిర్లక్ష్యంతో పల్లెల్లో పారిశుధ్యం పూర్తిగా పడకేసింది. హత్నూర మండలంలోని కాసాల గ్రామ పంచాయతీలో(Kasala Gram Panchayat ) పారిశుధ్య నిర్వహణ(Sanitation Management) అస్తవ్యస్తంగా మారింది. పల్లె ప్రగతి, స్వచ్ఛ తెలంగాణ నిబంధనల ప్రకారం తడి-పొడి చెత్తను వేరుచేసి డంపింగ్ యార్డుకు తరలించాల్సి ఉండగా, పంచాయతీ కార్యదర్శి పర్యవేక్షణ లోపంతో చెత్తను బహిరంగ ప్రదేశాల్లోనే కుప్పలుగా పోస్తున్నారు.

​గ్రామ శివారులోని రహదారులు, పంట పొలాల సమీపంలో చెత్తను ఇష్టారాజ్యంగా పడేస్తుండటంతో తీవ్ర దుర్గంధం వెదజల్లుతోంది. దోమలు, ఈగలు వృద్ధి చెంది డెంగ్యూ, మలేరియా(Malaria) వంటి వైరల్ జ్వరాలు ప్రబలే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పొలాలకు వెళ్లే రైతులు ముక్కు మూసుకుని వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. ప్రభుత్వం నుంచి నిధులు వస్తున్నా గ్రామంలో ఎక్కడా పారిశుధ్యం కానరావడం లేదని, లక్షలు వెచ్చించిన డంపింగ్ యార్డులు నిరుపయోగంగా మారాయని గ్రామస్తులు మండిపడుతున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్న కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో జిల్లా అధికారులను ఆశ్రయిస్తామని హెచ్చరిస్తున్నారు.

"యూసుఫ్ అలీ"(ఇన్చార్జి ఎంపీడీవో) వివరణ: బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయడం లేదా తగలబెట్టడం చేయడానికి వీలులేదని, కాసాలలో చెత్తను బహిరంగంగా పడేస్తున్న విషయం తన దృష్టికి రాలేదని, క్షేత్రస్థాయిలో విచారణ జరిపి నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

మరిన్ని వార్తలు