మండల కాంగ్రెస్ కమిటీ ఏర్పాటు ఎన్నడు?
అధ్యక్షుడి నియామకం జరిగి నెల రోజులు దాటినా.. పూర్తి కాని మండల కమిటీ కూర్పు...
అవకాశం కోసం కార్యకర్తల ఎదురుచూపులు
కేసముద్రం, సెప్టెంబర్ 11 (విజయక్రాంతి): కేసముద్రం మండల(Kesamudram Mandal) కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా చిలువేరు సమ్మయ్య గౌడ్ బాధ్యతలు స్వీకరించి నెల రోజులు దాటుతున్నప్పటికీ, ఇప్పటివరకు మండల కాంగ్రెస్ కమిటీ ఏర్పాటు కాకపోవడంపై పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది.
అధ్యక్షుడి నియామకం జరిగిన వెంటనే పార్టీని గ్రామస్థాయి వరకు మరింత బలోపేతం చేస్తారనే ఆశలు కార్యకర్తల్లో నెలకొన్నప్పటికీ, మండల కమిటీ ఏర్పాటు విషయంలో మాత్రం ఇంకా స్పష్టత రాకపోవడంపై పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మండల అధ్యక్షుడు నియమితులైన అనంతరం ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, వివిధ విభాగాల బాధ్యులు తదితరులతో కూడిన పూర్తి స్థాయి కమిటీని ఏర్పాటు చేసి పార్టీ కార్యక్రమాలను సమన్వయం చేయాల్సి ఉంటుంది. అయితే కేసముద్రం మండలంలో ఇప్పటికీ కమిటీ కూర్పు పూర్తి కాకపోవడం గమనార్హం.
పదవి వచ్చింది... కమిటీ ఎప్పుడు?
అధ్యక్ష పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా మండల కమిటీ ఏర్పాటు కాకపోవడంతో పార్టీ కార్యకలాపాలు కొంతవరకు వ్యక్తిగత స్థాయిలోనే కొనసాగుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. గ్రామస్థాయి నాయకులు, సీనియర్ కార్యకర్తలు, యువజన నాయకులకు బాధ్యతలు అప్పగిస్తేనే పార్టీ కార్యక్రమాలు పటిష్టంగా ముందుకు సాగుతాయని కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు కమిటీలో తమకు స్థానం దక్కుతుందా? ఎవరికి ఏ బాధ్యత అప్పగిస్తారు? అనే ఆసక్తితో ఎదురు చూస్తున్నారు.
అయితే కమిటీ ఏర్పాటుపై ఇప్పటివరకు స్పష్టమైన ప్రకటన లేక పోవడంతో సందిగ్ధత కొనసాగుతోంది. కార్యకర్తలకు బాధ్యతలు అప్పగించాల్సిన అవసరం ప్రభుత్వ కార్య క్రమాలు, పార్టీ ఆందోళనలు, ప్రజా సమస్యలపై పోరాటాలు, గ్రామ స్థాయి సమావేశాలు నిర్వ హించాలంటే పటిష్టమైన మండల కమిటీ అవసరం. అధ్యక్షుడికి తోడుగా వివిధ బాధ్యతలు నిర్వహించే నాయకత్వ బృందం ఉంటేనే పార్టీకార్యకలాపాలు సమర్థ వంతంగా సాగుతాయి. కమిటీ లేకపోవడం వల్ల కార్యకర్తలకు బాధ్య తలు లేకుండా పోయే పరిస్థితి ఏర్పడుతోందనే అభి ప్రాయం వ్యక్తమవుతోంది.
నాయకత్వంపై ప్రశ్నలు
నూతన అధ్యక్షుడిగా చిలువేరు సమ్మయ్య గౌడ్ నియామకంతో కేసముద్రం మండల కాంగ్రెస్లో కొత్త ఉత్సాహం వస్తుందని పార్టీ శ్రేణులు భావించాయి. అయితే నెల రోజులు గడిచినా కమిటీ ఏర్పాటు కాకపోవడంతో ఆ ఉత్సాహం క్రమంగా నిరీక్షణగా మారుతోందని పలువురు కార్యకర్తలు వ్యాఖ్యానిస్తున్నారు. అధ్యక్షుడి బాధ్యతలు స్వీకరించడం మాత్రమే కాకుండా, అదే స్థాయిలో పార్టీని సంఘటిత శక్తిగా తీర్చిదిద్దేందుకు వెంటనే పూర్తి స్థాయి కమిటీని ప్రకటించాలని వారు కోరుతున్నారు.
అదిష్టానం అనుమతుల కోసమేనా ఆలస్యం?
కమిటీ కూర్పులో సీనియర్ నాయకుల అభిప్రాయాలు, సామాజిక సమీకరణలు, వివిధ గ్రామాలకు ప్రాధాన్యత వంటి అంశాలు కమిటీ నియామకానికి ఆటంకంగా ఉండవచ్చని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. అయితే కమిటీ ఏర్పాటు ఆలస్యం ఎక్కువైతే కార్యకర్తల్లో అనవసర ఊహాగానాలు పెరిగే అవకాశం ఉందని పార్టీ శ్రేయోభిలాషులు సూచిస్తున్నారు. మొత్తానికి కేసముద్రం మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా చిలువేరు సమ్మయ్య గౌడ్ బాధ్యతలు చేపట్టి నెల రోజులు దాటింది. కానీ మండల కమిటీ మాత్రం ఇంకా కొలిక్కి రాలేదు. పార్టీని గ్రామస్థాయి వరకు బలోపేతం చేయాలంటే ఇకనైనా పూర్తి స్థాయి మండల కమిటీని ప్రకటించి కార్యకర్తలకు బాధ్యతలు అప్పగించాల్సిన అవసరం ఉందనే డిమాండ్ వినిపిస్తోంది.