పాల ఉత్పత్తుల కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే నాయిని
హనుమకొండ, అక్టోబర్ 5 (విజయక్రాంతి): విజయ డైరీ(Vijay Dairy) ఆధ్వర్యంలో హనుమకొండ బస్టాండ్ లో ఏర్పాటు చేసిన పాల ఉత్పత్తుల విక్రయ కేంద్రాలను వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్(MLA Naini Rajender), హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పాల ఉత్పత్తుల కేంద్రంలో ఏర్పాటు చేసిన వివిధ రకాల ఉత్పత్తులను వారు పరిశీలించారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు నాణ్యమైన, స్వచ్ఛమైన పాల ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకురావడంలో విజయ డైరీ కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు. నగరంలోని ప్రజలకు, ముఖ్యంగా బస్టాండ్‌కు వచ్చే ప్రయాణికులు, ఆసుపత్రులకు వచ్చే రోగులు, వారి సహాయకులు, సిబ్బందికి విజయ డైరీ ఉత్పత్తులు సులభంగా అందుబాటులో ఉండేలా ఈ కేంద్రాలను ఏర్పాటు చేయడం ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు.
జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పేయి మాట్లాడుతూ ప్రజలకు నాణ్యమైన పాల ఉత్పత్తులు అందుబాటులో ఉండేలా విజయ డైరీ విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ప్రజలు ఈ కేంద్రాలను వినియోగించుకోవాలని సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉండే ప్రాంతాల్లో ఇటువంటి కేంద్రాల ఏర్పాటు ద్వారా నాణ్యమైన పాల ఉత్పత్తులను సులభంగా పొందే అవకాశం కలుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఉపాధ్యక్షులు బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి,రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర పాలకమండలి సభ్యులు ఈవి శ్రీనివాసరావు,మాజీ కార్పొరేటర్లు తోట వెంకటేశ్వర్లు,వేముల శ్రీనివాస్, నాయకులు తోట పవన్, నలుబోల సతీష్, విజయ డైరీ డి.డి ధనరాజ్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.