సిద్ధిపేటలో విషాదం.. విద్యార్థి మృతి
సిద్ధిపేట: జిల్లా పరిధిలోని వర్గల్ బీసీ సంక్షేమ వసతి గృహంలో విషాద ఘటన చోటుచేసుకుంది. పదో తరగతి చదువుతున్న విద్యార్థి చరణ్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనతో విద్యార్థి కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే హాస్టల్‌కు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. మృతుడు మర్కూక్ మండలం పాతూరు గ్రామానికి చెందిన చరణ్‌గా పోలీసులు గుర్తించి, విద్యార్థి మృతికి దారితీసిన పరిస్థితులపై పోలీసులు విచారణ చేపట్టారు.
చరణ్ మృతి విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, గ్రామస్తులు వసతి గృహం వద్దకు ఆవేదన వ్యక్తం చేస్తూ ఆందోళన నిర్వహించారు. ఘటనకు గల కారణాలు ఏమిటి? హాస్టల్‌లో ఏం జరిగింది? అనే అంశాలపై సమగ్ర విచారణ జరిపించాలని వారు కోరుతున్నారు. విద్యార్థి మృతికి సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తు అనంతరం వెల్లడికానున్నాయి.