కంకర పరిచారు... తారును మరిచారు...
- నిధులు మంజూరైన... 4 ఏండ్లుగా ఎక్కడి పనులు అక్కడే..
- ప్రభుత్వ ఖజానాల్లో మూలుగుతున్న 125 కోట్లు...
ఉట్నూర్, నవంబర్04 ( విజయక్రాంతి ): ఉట్నూర్ ఐటీడీఏ పరిధిలో(Utnoor ITDA Area) అస్తవ్యస్తంగా ఉన్న రోడ్లతో పాటు మారుమూల గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యం లేక గిరిజనులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గిరిజనులు ఇబ్బందులు ఎదుర్కొడుతున్న విషయాన్ని గత బీ ఆర్ ఎస్ ప్రభుత్వం(BRS Government) గుర్తించి 2021-22లో 125 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఉమ్మడి జిల్లాలోని ఐటీడీఏ పరిధిలోని గిరిజన గ్రామాలకు ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో బీటీ రోడ్లు నిర్మించుటకు సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలోని ఇంజనీరింగ్ విభాగం శాఖకు పనులు అప్పగించారు. ప్రభుత్వం మంజూరు చేసిన నిధులకు గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీరింగ్ విభాగం అధికారులు బీటీ రోడ్డుల నిర్మాణానికి ప్రతిపాదనలు తయారు చేసి టెండర్లు పిలిచారు.
టెండర్లలో పని తీసుకున్న కాంట్రాక్టర్లు కొన్ని గ్రామాలకు పనులు ప్రారంభించగా అడవి శాఖ అధికారులు అడ్డుకున్నారు. ఈ సమయంలో పనులను కాంట్రాక్టర్లు నిలిపివేశారు. కొన్ని గ్రామాలకు మంజూరైన నిధులతో రోడ్డు పనులు ప్రారంభించారు. బీటీ రోడ్ల నిర్మాణంలో అవసరమైన కల్వర్టు నిర్మించడంతోపాటు కంకర వేశారు.
చేసిన పనికి బిల్లులు రాక...
గత ప్రభుత్వం మంజూరు చేసిన 125 కోట్ల పనులకు కాంట్రాక్టర్లు పనులు ప్రారంభించారు. ఇంజనీరింగ్ అధికారుల సూచనలు మేరకు కల్వర్ట్ లతోపాటు రోడ్డు పనులు ప్రారంభించారు. చేసిన పనులకు బిల్లులు ఇవ్వాలని అధికారుల చుట్టూ తిరిగారు. ఎంబి బుక్ లు రాసి బిల్లుల కోసం ఆర్థిక శాఖకు పంపించారు. అక్కడ బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్లు బీటీ రోడ్డు పనుల నిర్మాణం పనులను ఎక్కడికక్కడే నిలిపివేశారు.
దీంతో మారుమూల గిరిజన గ్రామాలకు కాలినడక సైతం కష్టంగా మారింది. కొన్ని గ్రామాల ప్రజలు వాగులు దాటి గ్రామాలకు చేరుకోవలసిన పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ఇంజనీరింగ్ అధికారులతో పాటు జిల్లా ఉన్నతాధికారులు , పాలకులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మంజూరైన బీటీ రోడ్ల పనులు ప్రారంభమై పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని గిరిజనులు కోరుతున్నారు.
- ప్రభుత్వానికి నివేదికలు పంపించాం..
- ఉజ్వల్, ఏ ఈ ఈ, గిరిజన గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీరింగ్ విభాగం..
ఉట్నూర్ ఎజెన్సీ ప్రాంతంలోని మారుమూల గ్రామాలకు మంజూరైన బీటీ రోడ్లపై రీ ఎస్టీ మెంట్ ల కోసం ప్రభుత్వానికి నివేదికలు పంపించాం. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే నాలుగేళ్ల క్రితం మంజూరైన రోడ్ల పనులకు తిరిగి టెండర్లు వేస్తాం. ప్రభుత్వం నుంచి మంజూరు రాగానే పనులు ప్రారంభించి బీటీ రోడ్ల పనులు పూర్తికి కృషి చేస్తాం..