టీయూ డబ్ల్యూజే ఐజేయు రాష్ట్ర విస్తృత కార్యవర్గ సమావేశం
- హెల్త్ కార్డుల పనితీరు, ఇళ్ల స్థలాలు, జర్నలిస్టుల రక్షణ చట్టంపై ప్రస్తావన
- మీడియా అకాడమీ చైర్మన్ కె శ్రీనివాసరెడ్డి సానుకూల స్పందన
భూపాలపల్లి టౌన్, నవంబర్ 04 ( విజయ క్రాంతి ) : జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారమే లక్ష్యంగా తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్(Telangana State Union of Working Journalists) ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర విస్తృత కార్యవర్గ సమావేశంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా జిల్లా అధ్యక్షులు క్యాతం సతీష్ కుమార్, ప్రధాన కార్యదర్శి సామంతుల శ్యామ్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా జిల్లాలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను సమావేశం దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపు, ఆరోగ్య బీమా హెల్త్ కార్డులు సక్రమంగా పనిచేసేలా చర్యలు తీసుకోవడం, జర్నలిస్టుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాల్సిన ఆవశ్యకతను ప్రస్తావించారు.
రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ, రాష్ట్ర కార్యదర్శి రామ్ నారాయణ సమక్షంలో సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె శ్రీనివాసరెడ్డికి ఈ సమస్యలను సభావేదిక ద్వారా వివరించగా వారు సానుకూలంగా స్పందించి జర్నలిస్టుల హెల్త్ కార్డులు, ఇళ్ల స్థలాల అంశాలపై ప్రభుత్వం నుంచి త్వరలోనే సానుకూల స్పందన వచ్చే అవకాశం ఉందని వారు తెలిపినట్లు పేర్కొన్నారు.