బైక్ ఢీ కొట్టడంతో ఓ వ్యక్తి మృతి
అయ్యప్ప మాలదారులతో కలిసి నడుస్తుండగా ప్రమాదం
ఘట్ కేసర్,(విజయక్రాంతి): అయ్యప్పమాలదారుల ఆశీర్వచనం తీసుకుని వారితో కలిసి కొద్దిదూరం పాదయాత్ర చేసిన ఓ వ్యక్తిని రోడ్డు ప్రమాదం(Road Accident) రూపంలో మృత్యువు కబళించింది. బైక్ ఢీకొనడంతో తీవ్రంగా గాయపడిన వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటన ఘట్‌కేసర్ పోలీస్‌స్టేషన్(Ghatkesar Police Station) పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని శ్రుతినగర్‌కు చెందిన తొర్రి సుధాకర్ (44) స్థానికంగా టెంట్‌హౌస్‌లో పనిచేస్తున్నాడు.
అతని స్నేహితులైన అయ్యప్పమాలదారులు శుక్రవారం భువనగిరి నుంచి శబరిమలకు పాదయాత్రగా బయలుదేరారు. ఈక్రమంలో శుక్రవారం రాత్రి 8 గంటల సమయంలో అవుషాపూర్ వద్దకు చేరుకున్న అయ్యప్పమాలదారులను సుధాకర్ కలిశాడు. వారి ఆశీర్వచనం తీసుకుని వారితో కలిసి సుమారు కిలోమీటరు మేర నడిచాడు. శ్రీనిధి రిసార్ట్స్ కమాన్ వద్దకు చేరుకోగానే ఘట్‌కేసర్ వైపు నుంచి వస్తున్న బైక్ సుధాకర్‌ను బలంగా ఢీకొట్టింది.
ఈప్రమాదంలో సుధాకర్ తలకు తీవ్ర గాయాలై, అధిక రక్తస్రావం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ హీనా తెలిపారు. సుధాకర్ మృతితో అతని కుటుంబంలో విషాదం నెలకొంది.