బస్టాండ్ సమీపంలో ఆర్మీ జవాన్ మృతదేహం
జమ్మూలో కలకలం రేపే ఘటన చోటుచేసుకుంది. ప్రధాన బస్టాండ్ సమీపంలోని బీసీ రోడ్డు పక్కన ఓ ఆర్మీ జవాన్ (Army Soldier) విగతజీవిగా కనిపించడం ఆందోళనకు దారితీసింది. శనివారం ఉదయం మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు (Investigation) ప్రారంభించారు. మృతుడిని రాంబన్ జిల్లా చందర్కోట్ ప్రాంతానికి చెందిన సంజీత్ సింగ్ (31)గా గుర్తించారు. సెలవుల కోసం స్వగ్రామానికి వచ్చిన ఆయన.. సెలవులు ముగియడంతో తిరిగి విధుల్లో చేరేందుకు బయలుదేరారు. గుర్దాస్పూర్లోని తన పోస్టింగ్ ప్రాంతానికి వెళ్తున్న క్రమంలో ఈ విషాదం చోటుచేసుకుంది.
బస్టాండ్ సమీపంలో జవాన్ మృతదేహం లభ్యం కావడంతో పోలీసులు పలు కోణాల్లో విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం (Postmortem) నిమిత్తం జమ్మూలోని జీఎంసీ ఆసుపత్రికి తరలించారు. అసలు సంజీత్ సింగ్ మృతికి కారణమేంటి? ఆయన ప్రయాణంలో ఏం జరిగింది? అన్న కోణంలో పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక (Medical Report)తో పాటు పోలీసుల దర్యాప్తులో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.