వజీర్ఎక్స్, బైనాన్స్పై ఫిర్యాదుల వెల్లువ
భారత క్రిప్టో మార్కెట్లో మరోసారి కలకలం రేగింది. క్రిప్టో ఎక్స్ఛేంజీలైన వజీర్ఎక్స్, బైనాన్స్ వ్యవహారంపై వేలాది మంది పెట్టుబడిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు భారీ ఆర్థిక నష్టాలు కలిగించాయంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (Central Bureau of Investigation) సహా కేంద్ర దర్యాప్తు సంస్థలను ఆశ్రయించినట్లు పలు నివేదికలు వెల్లడించాయి.
పెట్టుబడిదారులు సమర్పించిన ఫిర్యాదుల్లో అనుమతి లేకుండా ఖాతాల్లోకి ప్రవేశించడం, క్రిప్టో ఆస్తులను కోల్పోవడం వంటి తీవ్ర ఆరోపణలు ఉన్నట్లు తెలుస్తోంది. దేశంలో క్రిప్టోకరెన్సీ మోసాలను సమర్థంగా ఎదుర్కొనే సమగ్ర చట్టపరమైన వ్యవస్థ లేకపోవడంతో బాధితులకు న్యాయం అందడం కష్టంగా మారుతోందని ఫిర్యాదుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దాదాపు 1.6 కోట్ల మంది నమోదిత వినియోగదారులు ఉన్నట్లు ప్రచారం చేసుకున్న వజీర్ఎక్స్, అంతర్జాతీయ క్రిప్టో దిగ్గజం బైనాన్స్తో కొన్నేళ్లపాటు వ్యాపార సంబంధాలు కొనసాగించింది. 2019లో వజీర్ఎక్స్ను కొనుగోలు చేస్తున్నట్లు బైనాన్స్ ప్రకటించడం అప్పట్లో సంచలనం సృష్టించింది.
అయితే, 2022లో భారత దర్యాప్తు సంస్థలు ఈ ప్లాట్‌ఫామ్‌పై దృష్టి సారించి విదేశీ మారక ద్రవ్య నిబంధనల కింద నోటీసులు జారీ చేసిన తర్వాత యాజమాన్యంపై వివాదం తెరపైకి వచ్చిందని పెట్టుబడిదారులు ఆరోపిస్తున్నారు. వజీర్ఎక్స్ తమ యాజమాన్యంలో లేదని బైనాన్స్ పేర్కొనగా, వినియోగదారుల ఒప్పందంలో మాత్రం బైనాన్స్ను క్రిప్టో ఆస్తుల వాలెట్ సేవల ప్రదాతగా ప్రస్తావించడం సందేహాలకు తావిస్తోందని ఫిర్యాదుదారులు వాదిస్తున్నారు. అసలు వినియోగదారుల నిధులకు బాధ్యత వహించేది ఎవరు? అన్న ప్రశ్న ఇప్పుడు ప్రధానంగా మారింది.
2024 జూలైలో వజీర్ఎక్స్పై జరిగిన భారీ సైబర్ దాడి (Cyber Attack) క్రిప్టో ప్రపంచాన్ని కుదిపేసింది. ఈ ఘటన తర్వాత నష్టాలను ప్రభావిత, ప్రభావితం కాని వినియోగదారుల మధ్య పంపిణీ చేసే పునర్వ్యవస్థీకరణ ప్రతిపాదనను ఎక్స్ఛేంజ్ ముందుకు తెచ్చింది. అయితే, తమ క్రిప్టో హోల్డింగ్స్ నేరుగా దాడికి గురికాకపోయినా ఆస్తులను వినియోగించుకోలేకపోయామని పలువురు వినియోగదారులు ఆరోపిస్తున్నారు. ట్రేడింగ్ నిలిచిపోవడంతో మార్కెట్లో ధరలు పెరిగిన సమయంలోనూ తమ ఆస్తులను విక్రయించలేక భారీ లాభాలు కోల్పోయామని మరికొందరు వాపోతున్నారు.
వజీర్ఎక్స్కు చెందిన సింగపూర్ సంస్థ జెట్టై ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా అక్కడి కోర్టులో పునర్వ్యవస్థీకరణకు అనుమతి కోరడంపైనా పెట్టుబడిదారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా భారతీయ వినియోగదారులు తమ పెట్టుబడులకు సంబంధించిన నిర్ణయాలను విదేశీ న్యాయస్థానంలో సవాలు చేయాల్సి రావడం ఖర్చుతో కూడుకున్నదిగా, సంక్లిష్టంగా మారుతోందని వారు పేర్కొంటున్నారు. పునర్వ్యవస్థీకరణ ప్రక్రియలో వినియోగదారులు తమ క్రిప్టో హోల్డింగ్స్‌లో అధిక భాగాన్ని తిరిగి పొందారన్న వాదనలపైనా పిటిషనర్లు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. బహిరంగంగా వెల్లడించిన రికవరీ గణాంకాలకు, తమకు వాస్తవంగా అందిన మొత్తాలకు మధ్య గణనీయమైన వ్యత్యాసం ఉందని కొందరు పెట్టుబడిదారులు ఆరోపిస్తున్నారు.
మొత్తానికి క్రిప్టో మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన వేలాది మంది తమ డిజిటల్ ఆస్తుల భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్నారు. వజీర్ఎక్స్, బైనాన్స్ మధ్య బాధ్యతల వివాదం, సైబర్ దాడి నష్టాలు, పెట్టుబడుల రికవరీపై సందేహాలు ఇలా అనేక ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. ఈ ఆరోపణలపై దర్యాప్తు సంస్థలు ఎలాంటి చర్యలు తీసుకుంటాయి? పెట్టుబడిదారులకు పూర్తిస్థాయిలో న్యాయం జరుగుతుందా? అన్నది వేచి చూడాలి.