TCS కీలక ప్రకటన.. బిజినెస్‌కు బ్రేక్ పడుతుందా?

09-10-2026 | 11:14am

అమెరికా గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్‌పై(US Green Card Program) తీసుకున్న నిర్ణయం తమ ఉద్యోగుల నియామక వ్యూహంపై ప్రభావం చూపదని ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) స్పష్టం చేసింది. ఈ కార్యక్రమం తాత్కాలికంగా నిలిపివేయడంతో భారత ఐటీ కంపెనీలపై ఎలాంటి ప్రభావం ఉంటుందన్న చర్చ జరుగుతున్న వేళ TCS కీలక ప్రకటన చేసింది. తమ వర్క్‌ఫోర్స్ స్ట్రాటజీ (Workforce Strategy), కస్టమర్ సేవలు (Customer Engagements) యథావిధిగా కొనసాగుతాయని తెలిపింది. అమెరికా ప్రభుత్వం గురువారం TCSతో పాటు ఇన్ఫోసిస్, విప్రో, కాగ్నిజెంట్, మైక్రోసాఫ్ట్ సహా ఎనిమిది ఐటీ సంస్థలను విదేశీ ఉద్యోగుల కోసం గ్రీన్ కార్డ్ దరఖాస్తు ప్రక్రియకు సంబంధించిన కార్యక్రమం నుంచి సస్పెండ్ చేసింది. ఈ విధానం వల్ల అమెరికన్లకు ఉద్యోగ అవకాశాలు తగ్గుతున్నాయన్న వాదనతో ఈ చర్య తీసుకున్నట్లు సమాచారం.

రెండేళ్లలో సింగిల్ డిజిట్ దరఖాస్తులే: TCS

ఈ పరిణామంపై స్పందించిన TCS.. గత రెండేళ్లలో తమ PERM దరఖాస్తుల సంఖ్య సింగిల్ డిజిట్‌లోనే ఉందని వెల్లడించింది. అందువల్ల ఈ కార్యక్రమం నిలిపివేత తమ ఉద్యోగుల నియామక విధానాన్ని లేదా కస్టమర్లకు అందించే సేవలను ప్రభావితం చేస్తుందని భావించడం లేదని పేర్కొంది. అమెరికాలో స్థానిక నియామకాలపై దృష్టి పెట్టడం కూడా తమ విధానంలో భాగమని కంపెనీ తెలిపింది. దీంతో TCS US Green Card Programme అంశంపై ఉద్యోగులు, ఐటీ రంగం వర్గాల్లో నెలకొన్న చర్చకు సంస్థ తన వైఖరిని స్పష్టం చేసింది. అయితే అమెరికా ప్రభుత్వ నిర్ణయానికి సంబంధించిన తదుపరి పరిణామాలను ఐటీ కంపెనీలు ఎలా ఎదుర్కొంటాయన్నది వేచి చూడాలి.

మరిన్ని వార్తలు