రైతుల ప్రయోజనానికే భూముల రీసర్వే

09-10-2026 | 01:11pm

కలెక్టర్ ఇలా త్రిపాఠి వెల్లడి

ఫతేపూర్ లో నిర్వహిస్తున్న రీసర్వే ప్రక్రియ పరిశీలన

పకడ్బందీగా నిర్వహించాలని అధికారులకు ఆదేశం

రైతుల సమక్షంలో సర్వే నిర్వహించాలని మార్గనిర్దేశం

బోధన్,(విజయక్రాంతి): రైతులు(Farmer), భూ యజమానుల ప్రయోజనాలను కాపాడుతూ, భవిష్యత్తులో వారికి ఎలాంటి భూ సమస్యలు తలెత్తకూడదు అనే సదుద్దేశ్యంతోనే రాష్ట్ర ప్రభుత్వం రీసర్వే జరిపిస్తోందని కలెక్టర్ ఇలా త్రిపాఠి(Collector Ila Tripathi) వెల్లడించారు. ఈ ప్రక్రియకు రైతులు పూర్తి స్థాయిలో సహకరించాలని సూచించారు. సాలూర మండలం ఫతేపూర్ లో కొనసాగుతున్న భూముల రీసర్వే(Land Resurvey) ప్రక్రియను కలెక్టర్ ఇలా త్రిపాఠి శుక్రవారం అదనపు కలెక్టర్ వి.భుజంగరావుతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ, రోవర్ సహాయంతో సర్వే నిర్వహిస్తున్న తీరును క్షుణ్ణంగా పరిశీలిస్తూ, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అధికారులను పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలను పక్కాగా పాటిస్తూ, నిబంధనలకు అనుగుణంగా పూర్తి పారదర్శకంగా సర్వే నిర్వహించాలని, తద్వారా ఎలాంటి ఇబ్బందులు ఉత్పన్నం కావని అధికారులకు సూచించారు. రైతులు, పట్టాదార్లకు ఇబ్బందులు కలుగకుండా చూడాలన్నారు. ప్రతిరోజు సగటున 30 ఎకరాల చొప్పున సర్వేను నిర్వహిస్తూ, వేగవంతంగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని అన్నారు.

సర్వే సందర్భంగా క్షేత్రస్థాయిలో ఏవైనా ఇబ్బందులు ఏర్పడితే, తమ దృష్టికి తేవాలన్నారు. సర్వే చేపట్టే ముందు సంబంధిత రైతులకు తప్పనిసరిగా ముందస్తు సమాచారం అందించి, వారి సమక్షంలో సర్వే నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. భూమి హద్దుల వివరాల నమోదులో పొరపాట్లు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కాగా, సాలూర మండలంలో తొలి విడతలో మూడు గ్రామాలలో భూముల రీసర్వే జరుగుతోందని ఈ సందర్భంగా కలెక్టర్ వెల్లడించారు.

ఇప్పటికే బోధన్ రెవెన్యూ డివిజన్ లోని పోతంగల్, రెంజల్ తదితర మండలాల్లో 3వేల ఎకరాల వరకు విస్తీర్ణంలో సర్వే ప్రక్రియ పూర్తయ్యిందని తెలిపారు. రీసర్వే వల్ల భవిష్యత్తులో సరిహద్దు సమస్యలు ఉత్పన్నం కావని, తద్వారా భూ వివాదాలకు ఆస్కారం ఉండదని, భూ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సర్వే విషయంలో రైతులకు, భూ యజమానులకు ఏవైనా సందేహాలు ఉంటే గ్రామ పంచాయతీ అధికారులను సంప్రదించాలని సూచించారు. కలెక్టర్ వెంట బోధన్ ఆర్డీఓ విజయకుమారి, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ సహాయ సంచాలకులు శ్రీనివాస్ రావు, స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు ఉన్నారు.

మరిన్ని వార్తలు