బీసీలు రాజకీయంగా ఎదగాలి
ఆర్టీసీ యూనియన్ ఎన్నికల్లో బీడబ్ల్యూయూని గెలిపించాలి
టీఆర్పీ అధినేత తీన్మార్ మల్లన్న
మదనాపూర్, అక్టోబర్ 8(విజయక్రాంతి): బీసీల రాజకీయ చైతన్యం, సామాజిక న్యాయం, రాజ్యాధికార సాధనే లక్ష్యంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న(Teenmar Mallanna) చేపట్టిన బీసీ రాజ్యాధికారయాత్ర గురువారం వనపర్తి జిల్లా మదనాపూర్‌కు చేరుకుంది. తీన్మార్ మల్లన్న గ్రామంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రజలు తమ సమస్యలను మల్లన్న దృష్టికి తీసుకురాగా అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తానని భరోసా ఇచ్చారు.
ఆర్టీసీ కార్మికులతో మల్లన్న ప్రత్యేకంగా ముచ్చటించారు. ఆర్టీసీ యూనియన్ ఎన్నికల్లో బహుజన్ వర్కర్స్ యూనియన్ (బీడ బ్ల్యూయూ) కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కార్మికులను కోరారు. ఆర్టీసీ కార్మికులకు బహుజన్ వర్కర్స్ యూనియన్ గ్యారెంటీ కార్డును మల్లన్న అందజేశారు. అనంతరం మల్లన్న మాట్లాడుతూ బీసీలు కేవలం ఓటర్లుగా మిగిలిపోకుండా రాజకీయంగా ఎదగాల్సిన అవ సరం ఉందని పేర్కొన్నారు. జనాభాలో అధికంగా ఉన్న బీసీలకు రాజకీయ అధికారంలో తగిన ప్రాతినిధ్యం దక్కాలని అన్నారు.