ఫైజర్, టాటా భాగస్వామ్యం!
హైదరాబాద్: క్యాన్సర్(Cancer) ముప్పును ముందుగానే గుర్తించి, ప్రాణాలను కాపాడే లక్ష్యంతో ఫైజర్(Pfizer), టాటా క్యాన్సర్ కేర్ ఫౌండేషన్ (TCCF) కీలక భాగస్వామ్యంతో ముందుకు సాగుతున్నాయి. సమాజ స్థాయిలో క్యాన్సర్‌పై అవగాహన పెంచడంతో పాటు, ముందస్తు పరీక్షలను మరింత మందికి అందుబాటులోకి తీసుకురావడంపై ప్రత్యేక దృష్టి సారించాయి. జార్ఖండ్, అస్సాం, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల్లో ఇప్పటివరకు 14.1 లక్షల మందికి ఈ కార్యక్రమం ద్వారా సేవలు అందించగా, 11,15,558 మందికి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు.
అంతేకాకుండా 31,000 మంది ఆరోగ్య నిపుణులకు శిక్షణ అందించారు. ఈ కార్యక్రమాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ఫైజర్, TCCF వివిధ ప్రభుత్వ, ప్రజారోగ్య, వైద్య సేవా సంస్థలు, అభివృద్ధి భాగస్వాములతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించాయి. 'క్యాన్సర్ సంరక్షణలో వివిధ రంగాల భాగస్వామ్యంతో నూతన ఆవిష్కరణలు, మార్పులు' అనే అంశంపై జరిగిన ఈ సమావేశంలో క్యాన్సర్ పరీక్షలను విస్తరించడం, ప్రజల్లో వ్యాధిపై అవగాహన పెంచడం, అనుమానిత కేసులను సకాలంలో మెరుగైన వైద్య సేవలకు పంపించడం వంటి అంశాలపై చర్చించారు.
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్‌కు చెందిన నేషనల్ క్యాన్సర్ రిజిస్ట్రీ ప్రోగ్రామ్ అంచనాల ప్రకారం, 2024లో భారతదేశంలో సుమారు 15.3 లక్షల కొత్త క్యాన్సర్ కేసులు నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేయడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. ఈ నేపథ్యంలో క్యాన్సర్ లక్షణాలు, ప్రమాద కారకాలపై ప్రజలకు అవగాహన కల్పించడం, క్రమం తప్పకుండా అవసరమైన స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవడం, అనుమానిత లక్షణాలు కనిపించినప్పుడు ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించడం అత్యంత కీలకమని నిపుణులు సూచిస్తున్నారు. ముందస్తు గుర్తింపు, సకాలంలో వైద్య సేవలు అందుబాటులోకి రావడం ద్వారా క్యాన్సర్‌పై పోరాటాన్ని మరింత సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లవచ్చనే లక్ష్యంతో ఈ భాగస్వామ్యం కొనసాగుతోంది.