దీపం వెలిగించాల్సిందే

28-11-2026 | 05:25am
  1. తమిళనాడు ప్రభుత్వంపై సుప్రీంకోర్టు మండిపాటు 
  2. దీపతూన్‌పై సుప్రీం ఆదేశాలనే ధిక్కరిస్తారా?
  3. ప్రభుత్వ అధికారులకు కోర్టు ధిక్కరణ నోటీసులు
  4. ట్రస్టీలకు ఉద్వాసన.. ఆలయ పాలనకు రిటైర్డ్ జడ్జీలు
  5. ఆలయానికి సీఆర్‌పీఎఫ్ భద్రతకు ఆదేశం

న్యూఢిల్లీ, నవంబర్ 27: తమిళనాడులోని మధురై తిరుపరం కుండ్రం కొండపై కార్తీక దీపం వెలిగించకపోవడంపై సుప్రీం కోర్టు(Supreme Court) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలనే ధిక్కరిస్తారా? అని తమిళనాడు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ప్రభుత్వ ఉన్నతాధికారులకు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. దీపతూన్ వద్ద శనివారం కార్తీక దీపం వెలిగించాల్సిందే అని స్పష్టం చేసింది. హజ్రత్ సుల్తాన్ సికందర్ బాద్‌షా ఔలియా దర్గా చుట్టూ 50 మీటర్ల పరిధిని మినహాయించాలని స్పష్టం చేసింది.

దర్గా ప్రాంతానికి ఇబ్బంది కలగకుండా బారికేడ్లు ఏర్పాటు చేయాలని, దర్గా భూమిపై ఎవరికీ కొత్త హక్కులు ఏర్పడవని స్పష్టం చేసింది. అరుళ్మిగు సుబ్రమణ్యస్వామి ఆలయ ధర్మకర్తల మండలిని సస్పెండ్ చేసి.. ఇద్దరు రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తులు వైద్యనాథన్, పార్థిబన్‌లను రిసీవర్లుగా నియమించింది. తిరుపరంకుడ్రం ఆలయం, కొండ ప్రాంత భద్రతను సీఆర్‌పీఎఫ్‌కు అప్పగించింది. కోర్టు ఉత్తర్వులను అమలు చేయకుండా అడ్డుకునే ప్రయత్నాలను సహించబోమని తేల్చి చెప్పింది. 

మదురై కలెక్టర్‌పై సుప్రీం అసంతృప్తి

కోర్టు ధిక్కరణ వ్యవహారంలో మదురై జిల్లా కలెక్టర్ తీరుపై సుప్రీం కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. జిల్లా మేజిస్ట్రేట్‌గా కోర్టు ఆదేశాలను అమలు చేయాల్సిన బాధ్యత కలెక్టర్‌పై ఉందని స్పష్టం చేసింది. తన బాధ్యతను ఇతరులపైకి నెట్టే ప్రయత్నం చేశారని అభిప్రాయపడింది.

తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, హిందూ మంత ధర్మాదాయ శాఖ కార్యదర్శి, కమిషనర్, మదురై జిల్లా కలెక్టర్, పలువురు పోలీసు ఉన్నతాధికారులు, ఆలయ కార్యనిర్వాహక అధికారి, ట్రస్టు చైర్మన్, నలుగురు ధర్మకర్తలు డిసెంబర్ 15వ తేదీన వ్యక్తిగతంగా కోర్టు ముందుకు హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. సుప్రీం కోర్టు తీర్పున ప్రధాని మోదీ అభినందించారు. ‘మురుగన్ స్వామికి జై’ అంటూ తన ‘ఎక్స్’ ఖాతాలో ప్రధాని పోస్ట్ చేశారు. తమిళనాడులోని విజయ్ ప్రభుత్వం రాజీనామా చేయాలని తమిళనాడు బీజేపీ డిమాండ్ చేసింది. 

మరిన్ని వార్తలు